అమ్మో . .. ఒకటో తారీఖు అని ఏపీ ఉద్యోగులు మరోసారి అనుకునే పరిస్థితి వచ్చింది. జీతాలు సమయానికి వస్తాయన్న గ్యారంటీ లేదు. కేంద్రం ఇచ్చిన అదనపు అప్పులన్నీ తీసేసుకున్నారు. ఇంకో 900 కోట్లను నేడు తీసుకుంటున్నారు. గత వారం రెండు వేల కోట్లను తీసుకున్నారు. అవి మొత్తం ఓవరా డ్రాఫ్ట్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఓడీ తీసుకుని సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వివిధ రకాలుగా నిధులు సమీకరించుకోవచ్చని అనుకుంది. అందుకే.. విద్యా దీవెన కింద… ఓ విడత చెల్లింపునకు షెడ్యూల్ ఇచ్చింది. ఇరవై ఎనిమిదో తేదిన బటన్ నొక్కుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు డబ్బులు లేకపోవడంతో వాయిదా వేసింది.
విద్యాసంవత్సరం ముగిసిపోతోంది. ఇంత వరకూ ఒక్క విడత కూడా ఇవ్వలేదని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరో వైపు కాలేజీలకు లింక్ తీసేయడంతో… ఫీజులు ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్న దానితో సంబంధం లేదని… కట్టాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో వైపు ఆసరా ఫథకం కింద రుణమాఫీ హామీ కింద… డ్వాక్రా మహిళలకు .. రూ. ఆరు వేల కోట్ల వరకూ ఓ వాయిదా జమ చేయాల్సి ఉంది. రూ. ఏడు వందల కోట్లే లేవు.. ఇక ఆరు వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని అంటున్నారు. ఈ నెల కూడా ఆసరా పథకం కష్టమేనంటున్నారు. అదే సమయంలో పారిశ్రామిక రాయితీలు రూ. ఏడు వందల కోట్లు ఇవ్వకపోవడం వివాదాస్పదమయింది. ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి బకాయిలు పెండింగ్లో ఉన్ాయి.
మార్చి నెల సహజంగా ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కాబట్టి… బిల్లుల చెల్లింపుల ఒత్తిడి ఎక్కువగా ఉండనుంది. రెండు నెలల ముందు నుంచే కొత్తగా బిల్లులు అప్ లోడ్ చేయడం ఆపేశారు. కానీ ఇప్పటికే క్యూలో ఉన్న బిల్లలకు… ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన వారికీ చెల్లింపుల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలు మరింత ఆలస్యం అవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ సారి ఉద్యోగుల జీతాలు వేయడం ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఇరవయ్యో తేదీ వరకూ కొనసాగుతోంది. ఈ రోజు వస్తాయి.. ఈ రోజు వస్తాయి అని ఎదురు చూపులతోనే ముగిసిపోతోంది. వచ్చే నెల నుంచి కేంద్రం కొత్త అప్పులకు అవకాశం ఇస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం కాబట్టి మరికొంత కొత్త అప్పులకు అవకాశం దొరుకుంది. ఈ ఒక్క నెల గడిస్తే చాలని.. వచ్చే నెల నుంచి జీతంపై భరోసా పెట్టుకోవచ్చని ఉద్యోగులు అనుకుంటున్నారు.