అందం అంతా చూసే కళ్లలోనే ఉంటుందని ఉంటారు. ఒక్క అందం విషయంలోనే కాదు… అన్ని విషయాల్లోనూ చూసేకళ్లను బట్టి ఎదుటి వస్తువు సౌందర్యం కనిపిస్తుంది. గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ఒక్కరంటే ఒక్కరూ వ్యతిరేకించలేదు. ఇదే ఉత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి సిటీని డిజైన్ చేయించారు. దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ప్లాన్స్ ను.. .. గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారు. తమకు ఉన్న సోషల్ మీడియా బలంతో అదే ప్రచారం చేశారు. ప్రజలను నమ్మేలా చేశారు. కానీ నిజానికి అవి గ్రాఫిక్స్ కాదని.. ఆర్కిటెక్చరల్ అద్భుతం అని … ప్రపంచం అంతా గుర్తించింది.
నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాలతో ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఓ జాబితా రూపొందించింది. ఈ టాప్-6 భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి కూడా స్థానం లభించింది.
ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వెల్లడించింది. అమరావతి ప్లాన్ ను పరిశీలిస్తే…. ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, భారతదేశ రాజధాని హస్తినలోని లుట్యెయన్స్ ఢిల్లీ, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో అమరావతి నగరం మధ్యన భారీ పచ్చదనం కనువిందు చేసేలా డిజైన్ చేశారని వివరించింది. అంతేకాదు, పర్యావరణ పరంగా ఏమాత్రం రాజీపడని విధంగా నగరంలో 60 శాతం పచ్చదనం కానీ, నీరు కానీ ఉండేలా ప్రణాళిక రూపొందించారని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొంది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదని, కానీ భవిష్యత్ లో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలన్నదానిపై గొప్ప దార్శనికతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
అమరావతి గనుక రూపుదిద్దుకుని ఉంటే ప్రపంచ మహానగరాల్లో ఒకటిగా సుస్థిర స్థానం పొందేదని స్పష్టం చేసింది. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాలు, ఫొటోవోల్టాయిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటర్ ట్యాక్సీలు, సైకిల్ తొక్కేవారికోసం ప్రత్యేక మార్గాలతో అమరావతి ఒక విలక్షణ నగరం అయ్యేదని అభిప్రాయపడింది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్… ఆ రంగంలో తిరుగులేని పత్రిక.
అద్భుతమైన ప్రణాళికతో శరవేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణాన్ని అడ్డగోలుగా నిలిపివేశారు. ప్రపంచం మొత్తం గుర్తించిన అమరావతిని పాలకులు విధ్వంసం చేస్తున్నా ఆంధ్రులు నోరెత్తలేకపోయారు. ఫలితంగా రాష్ట్రం తమ దశను మార్చే ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోయింది.