రుషికొండపై కేవలం 2.88 ఎకరాల్లోనే తవ్వడానికి అనుమతి ఉంది. కానీ ఇరవై ఎకరాలపైకా తవ్వేశారని కోర్టులో కేసులు పడ్డాయి . దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో హైకోర్టు కొలతలు తీయిస్తోంది.. ఆ నివేదిక రావాల్సి ఉంది. అయితే తాము తవ్వేసిన ఆ ఇరవై ఎకరాలతోనే ఆగిపోవడం లేదని… ఏకంగా 61 ఎకరాలపై తమ కన్ను ఉందని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. రుషికొండపై 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతలు ఇస్తూ జీవీఎంసీ అధికారులు ప్లాన్ మంజూరు చేశారు. ప్లాన్ మంజూరు చేయడానికి కావాల్సిన పత్రాలేమీ లేకపోయినా.. మొత్తం ఫీజు చెల్లించకపోయినా అనుమతి ఇచ్చేశారు.
హైకోర్టులో జరుగుతున్న విచారణలో కూడా 2.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడతామని పర్యాటక శాఖ తెలిపింది. కానీ రుషికొండ విషయంలో చెప్పేదొకటి.. చేసేది ఒకటి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంంఘిస్తూ… అన్ని రకాల పనులు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి.. కొండ మొత్తం తవ్వేసి నిర్మాణాలు చేపడతామన్నట్లుగా ప్లాన్ మంజూరు చేయించుకున్నారు.
రుషికొండ ఓ పర్యావరణ అద్భుతం. విశాఖకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించేలాఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కొండను బోడికొండ చేశారు. ఇప్పుడు మరో నలభై ఎకరాలను తవ్వడం అంటే… దాదాపుగా మొత్తం కొండను లేకుండా చేయడమేనన్న అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏదైనా.. ఇంత విధ్వంసం చేసిన ప్రభుత్వం గతంలో లేదన్న అసహనం విశాఖ వాసుల్లోనూ కనిపిస్తోంది.