ఏపీ బీజేపీలో ఉన్నదంతా పేరుకే నాయకులు. వారికి పది ఓట్లు కూడా రావు. ఇప్పుడు వారు కూడా సోషల్ మీడియాలో పడి రచ్చ చేసుకుంటున్నారు. రెండు వర్గాలుగా చీలి ఆరోపణలు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది సీనియర్లు పార్టీలో చేరారు. ఆది నారాయణరెడ్డి. వరదాపురం సూరి, అన్నం సతీష్ ఇలా పలువురు నేతలు చేరారు. అయితే వీరెవరికీ పార్టీలో ప్రయారిటీ లభించలేదు. చివరికి విలీనమైన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లకూ అంతే. అదే సమయంలో ఎప్పట్నుంచో బీజేపీలో ఉన్న వారికీ నిరాదరణ తప్పలేదు. విష్ణుకుమార్రాజు, కామినేని శ్రీనివాస్ వంటి వాళ్లు రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నరు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరంతా మరో ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం గుప్పు మంటోంది.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న లేకపోయినా అధికారానికి ఆమడ దూరంగా ఉన్నా.. బీజేపీ నేతలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవంగా చూస్తుంది. కేంద్రం నుంచి కొన్ని నామినేటెడ్ పదవులు కూడా వస్తాయి. వచ్చాయి కూడా. అలాంటి పార్టీలో ఉండటానికి ఇప్పుడు బీజేపీ నేతలు ఆసక్తి చూపించడం లేదు. ఎవరికి వారు తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షడు కన్నా లక్ష్మినారాయణ .. మోదీ అంటే గౌరవమే కానీ రాష్ట్రం కోసం పార్టీ మారక తప్పడం లేదని ప్రకటించారు. ఇందుకు ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని కారణంగా చూపించారు. ఆ తర్వాత నుంచి ఏపీ బీజేపీలో అలజడి ప్రారంభమయింది. చాలా మంది పార్టీ మారుతారని చెబుతున్నారు.
పరిస్థితి తేడాగా మారుతుందని తెలిసినప్పటికీ బీజేపీ హైకమండ్ పెద్దగా స్పందించడం లేదు. నేతలు పార్టీమారినా లైట్ తీసుకుంటోంది. ఏపీలో బీజేపీ మెరుగుపడుతుందని హైకమాండ్ ఆశలు పెట్టుకోవడం లేదని.. అక్కడ ఏ పార్టీ గెలిచినా… బీజేపీ కనుసన్నల్లోనే ఉంటుందన్న ఉద్దేశంతో సీరియస్గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అలా హైకమాండే అనుకుంటే.. ఇక రాష్ట్ర నేతలుగా తమ పోరాటం ఎలా వర్కవుట్ అవుతుందని ఇతర నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ బీజేపీకి ఇంకా మంచి రోజులు రాలేదని మాత్రం స్పష్టమవుతోంది. దీనికి కారణం హైకమాండేనని ఎక్కువ మంది భావన.