ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిన్నామొన్నటిదాకా తాను ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఏమైనా కాంట్రాక్టులు దక్కాయో లేదో కానీ… ఏపీలో మాత్రం ఆయన పంట పండుతోంది. ఇాలా కంపెనీలు పెట్టేసి అలా కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల కాంట్రాక్టులు.. వందల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులు చేశారని ప్రచారం జరుగుతూండగానే.. తాజాగా మైనింగ్ సీవరేజీ వసూలు కాంట్రాక్టులు.. కీలకమైన జిల్లాల్లో పొంగులేటికి.. ఆయన కుటుంబానికి చెందిన వారికే దక్కుతున్నాయి.
మైనింగ్ శాఖ… సీవరేజీ వసూలును ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. అసలు ఈ నిర్ణయంలోనే ఎవరికైనా పెద్ద స్కాం ఉందని అనిపిస్తుంది. తవ్వుకునేది లీజు పొందిన వాళ్లయితే… సీవరేజీ వసూలు చేయాల్సింది ప్రభుత్వం. కానీ ప్రైవేటు సంస్థల వద్ద ఎంతో కొంత తీసుకుని వారినే వసూలు చేసుకోమని ప్రభుత్వం చాన్సిస్తుందన్నమాట. ఇందు కోసం ఎన్ని కబుర్లు చెప్పినా.. ఇదేదో అక్రమాలకు రహదారి అని అర్థమైపోతుంది. ఇలా సీవరేజీ వసూలు చేసే ప్రైవేటు సంస్థలను ఇప్పుడు ఎంపిక చేస్తున్నారు. మైనింగ్ ఎక్కువ జరిగే సీమ ప్రాంతంలో… సీవరేజీ వసూలు టెండర్లు పొంగులేటి కంపెనీలకే దక్కుతున్నాయి.
రాఘవ కన్ స్ట్రక్షన్స్ అనే ఓ కంపెనీతో పాటు… టెండర్లు పిలిచిన తర్వాత పొంగులేటి ఫ్యామిలీ కొడుకులు, కూతుళ్ల పేరుతో ఏర్పాటయిన కంపెనీ కి కూడా ఓ కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ కంపెనీ ఒక్కటే బిడ్ వేసింది. ఇలాంటి చిత్ర విత్రాలు బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారు. మొత్తంగా పొంగులేటికి… సీఎం జగన్ తో రాజకీయాలకు అతీతమైన సంబంధం ఉన్న విషయం.. ఈ కాంట్రాక్టుల ద్వారా స్పష్టమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.