తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కు.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆదర్శంగా మారినట్లుగా కనిపిస్తున్నారు. ప్రజల్లో భయం కల్పించేందుకు అనేక రకాల ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల అంతు చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని, అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని ప్రకటించేశారు.
బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి మాట్లాడుతూ తెలంగాణలో మహిళలపై అన్యాయాలు,అక్రమాలు,అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు.. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లలతో కూల్చేస్తాం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకేలా చేస్తామని అన్నారు.తెలంగాణలో మహిళలను కించపరుస్తుంటే సహించాలా అని ఆవేశపడ్డారు.
ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం ఉంటుందని.. శిక్షలు విధించడానికి కోర్టులు ఉంటాయనే సంగతిని బండి సంజయ్ మర్చిపోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ వంటి చోట్ల ఓ వర్గం ఆస్తులపైనే బుల్ డోజర్ ను ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇప్పుడు బండి సంజ్య కూడా అలాంటి ఫీలింగ్ తెస్తామని చెబుతున్నారు. అయితే యూపీలో ఇలాంటివి వర్కవుట్ అవుతాయేమో కానీ.. తెలంగాణలో మాత్రం మైనస్ అవుతాయన్న ఆందోళన మరో వర్గం బీజేపీ నేతల్లో ఉంది.