నాగశౌర్యలోని రియల్ హీరో బయటకు వచ్చాడు. నడిరోడ్డుపై అమ్మాయిని చేయి చేసుకొన్న ఓ యువకుడ్ని నిలదీసిన నాగశౌర్య నెటిజన్ల మనసుల్ని గెలుచుకొన్నాడు. మంగళవారం హైదరాబాద్లో… నడిరోడ్డుపై ఓ యువతిని ఓ యువకుడు కొట్టడం.. శౌర్య గమనించాడు. ఆ సమయంలో కారులో వెళ్తున్న శౌర్య, వెంటనే కిందకి దిగి… ఆ యువకుడ్ని అడ్డుకున్నాడు. అంతే కాదు.. రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్? అంటూ నిలదీశాడు. `మేమిద్దరం లవర్స్` అని ఆ అబ్బాయి చెప్పినా శౌర్య శాంతించలేదు. లవర్ అయితే కొడతావా? అంటూ మరింత గట్టిగా అడగడంతో.. చివరికి ఆ అమ్మాయికి అబ్బాయి సారీ చెప్పాడు. నిజానికి ఇదంతా.. ఫ్రాంక్ వీడియోనో, సినిమా ప్రమోషన్ కోసమో చేశారనుకొన్నారంతా. కానీ.. అది రీల్ కాదని, రియల్ అని ఆ తరవాత అర్థమైంది. దాంతో.. శౌర్య చేసిన పనికి సోషల్ మీడియాలో పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. శౌర్య మంచి పని చేశాడంటూ అంతా అభినందిస్తున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీ వ్యక్తుల మనసుల్నీ గెలుచుకొన్నాడు నాగశౌర్య. ముఖ్యంగా హీరోయిన్లు కొంతమంది శౌర్యకు ఫ్యాన్స్ అయిపోయారు. కొంతమంది కథానాయికలు శౌర్యకు ఫోన్ చేసి.. అభినందిస్తున్నారట. మొత్తానికి తెర మీదే కాదు… బయట కూడా తాను రియల్ హీరోనే అనిపించుకొన్నాడు నాగశౌర్య.