ఆంధ్రప్రదేశ్లో గంజాయి విప్లవం కనిపిస్తోంది. ఓ వైపు గంజయి మత్తులో మైనర్లు కూడా చెలరేగిపోయి దారుణాలకు పాల్పడుతూంటే పోలీసులు మాత్రం రాజకీయ కారణాలతో గంజాయి దొరికిందంటే.. కొంత మందిపై కేసులు పెట్టేసి.. తమ బాసులను ఆనందపరుస్తున్నారు. వారి దగ్గర దొరికిదంటూ…ఎంతో కొంత గంజాయి ని సైతం చూపిస్తున్నారు. ఏపీ గంజాయి క్యాపిటల్ గా మారిపోయిందన్న ఆందోళనతో నారా లోకేష్ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు.
గంజాయి మత్తులో ఘోరాలు చేస్తున్న నేరస్తులు !
గుంటూరులో మంగళవారం రాత్రి ఇద్దరు మైనర్లు గంజాయి కొట్టి ఇద్దరు వాచ్ మెన్లను హత్య చేశారు. పది మందిపై దాడి చేశారు. లూటీలు చేశారు. వీరిద్దరూ గంజాయికీ బానిసలని పోలీసులు చెబుతున్నారు. తాడేపల్లిలో ఓ మహిళను నరికి చంపిన వ్యక్తి కూడా గంజాయి బానిసే. కానీ మద్యం మత్తు అని పోలీసులు కవర్ చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఈ గంజాయి మత్తులో చేస్తున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు.. కవర్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మద్యం మత్తు అని.. మరో చోట పాత నేరస్తులు అని చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ… ఏపీ వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మకం జరుగుతోందన్నది మాత్రం కళ్ల ముందు కనిపిస్తున్న నిజం.
కాలేజీల టార్గెట్గా యువత భవిష్యత్ పై దాడి !
ఏపీలో సక్రమ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతలు. వారి సానుభూతిపరులు ఎక్కువ మంది అక్రమ వ్యాపారాలపై దృష్టి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు చేసే వ్యాపారాల పట్ల పోలీసులు కూడా చూసీ చూడనట్లుగానే ఉంటున్నారు. ఈ కారణంగానే గంజాయి వ్యాపారం సాగుతోందని.. కాలేజీల్ని టార్గెట్ చేసుకుని … పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో నిఘాలు పెట్టామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు. ఎన్ని నిఘాలు పెట్టినా ఏం ప్రయోజనం ఉండటం లేదని.. యువత భవిష్యత్ గంజాయికి బానిసగా మారుతోందన్న ఆందోళన ఏపీలో వ్యక్తమవుతోంది.
రాజకీయ బాసుల కోసం గంజాయి కేసులు పెడుతున్న పోలీసులు ?
ఇటీవల గంజాయి దొరికిదంటూ పోలీసులు కొంత మందిపై కేసులు పెడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేసి.. తర్వాత విభేదించిన అజయ్ అమృత్ అనే వ్యక్తి మీద… తాజాగా ఒంగోలులో వైశ్య నేత సుబ్బారావు గుప్తా మీద కూడా గంజాయికేసు పెట్టారు. వీరిద్దరి అరెస్టులో పోలీసులు ఒకే కథ చెప్పారు. వీరు వాహనంపై వెళ్తూండగా పోలీసుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించారట.. పట్టుకుని సెర్చ్ చేస్తే గంజాయి దొరికిందట. పోలీసులు ఇలా గంజాయి కేసుల్ని రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తూంటే.. అసలు గంజాయి మాత్రం… దహించివేసే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఏపీలో వ్యక్తమవుతోంది.