బెంజ్ మంత్రిగా విపక్షాలు విమర్శించే గుమ్మనూరు జయరాం ఐటీ శాఖ గుప్పిట్లో చిక్కుకున్నారు. ఆయన మంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యుల పేరుపై రిజిస్ట్రే,షన్ చేయించుకున్న భూములన్నీ బినామీవేనని గుర్తించి..జప్తు చేశారు. మొత్తం 90 ఎకరాలను జప్తు చేశారు. ఆయన భార్య రేణుకమ్మ పేరున ఉన్న మరో 30.83 ఎకరాలను తాత్కాలికంగా అటాచ్ చేశారు. పూర్తిగా ఎందుకు అటాచ్ చేయరాదో ఈ నెల 17వతేదీలోగా వివరణ ఇవ్వాలంటూ.. నోటీసిలిచ్చారు ఐటీ అధికారులు. ఈ భూములను అన్యాక్రాంతం, బదిలీ చేయవద్దంటూ సబ్ రిజిస్ట్రార్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఐటీశాఖ లేఖలు రాసింది.
ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబ ఆదాయం కేవలం 19వేల రూపాయలు. కానీ రూ. కోటి అరవై లక్షల నగదు ఇచ్చి కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లా అస్పరిలో మొత్తం 180 ఎకరాల భూమిని మంత్రి జయరాం భార్య రేణుకతో పాటు కుటుంబసభ్యులు ఒకే రోజు కొన్నారు. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయ్యాయి. ఇట్టినా అనే కంపెనీకి 450ఎకరాల భూమి ఉంది. ఫ్యాక్టరీ పెడతామని ఉద్యోగాలు ఇస్తామని రైతుల వద్ద నుంచి తక్కువకే కొనుగోలు చేశారు. ఫ్యాక్టరీ పెట్టలేదు. కానీ ఆ భూములు మంత్రి పేరు మీదకు మారిపోయాయి.
ఇట్టీనా కంపెనీ . .పరిశ్రమ పెట్టి.. భూములు ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి అతి తక్కువ ధరలకు భూములను సేకరిచింది. అయితే పరిశ్రమ పెట్టలేదు.. ఉద్యోగాలివ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆ రైతులకు.. భూములు వెనక్కి ఇప్పిస్తానని జయరాం హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. కానీ రైతులకు ఇస్తానన్న భూములు గురించి మాట్లాడలేదు. గుంభనంగా ఆ భూముల్లో వంద ఎకరాలు ఆయన కుటుంబీకుల పేర్లపైకి మారిపోయాయి. ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ అటాచ్ చేసింది. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా అధికార బలంతో ఈ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.