కారణాలు ఏవయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకి దాని స్వంత మీడియా సాక్షి తప్ప వేరే ఏవి కూడా అంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించవు. ఆ కారణంగా మీడియాలో వైకాపా, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేక వార్తలే ఎక్కువగా కనబడుతుంటాయి. అందుకు జగన్ స్వయంకృతాపరాధం కూడా కారణమేనని చెప్పవచ్చును. విషయంలోకి వస్తే ఇటీవల వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి క్యూ కట్టడంతో, పార్టీ పరిస్థితిపై చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా మొన్న తన ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. చాలా ముఖ్యమయిన ఆ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో వారందరూ కూడా త్వరలో పార్టీ వీడబోతున్నారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. వారిలో ఒకరయిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఈరోజు వైకాపాకి గుడ్ బై చెప్పేసారు. తాను మార్చి 4న తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించేరు కూడా.
అయితే వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నిన్న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం గురించి కొన్ని పత్రికలూ, మీడియా సంస్థలు కట్టుకధలు వ్రాసాయి. మా పార్టీకి నష్టం కలిగించే విధంగా తప్పుడు కధనాలు రాసే మీడియాపై పరువు నష్టం దవా వేయాలని పార్టీ నిర్ణయించింది. మా పార్టీపై కక్ష గట్టినట్లు పనిగట్టుకొని తప్పుడు కధనాలు ప్రచురించే మీడియా సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి పనుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు? అవినీతి సొమ్ముతో మా పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్న ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదు?” అని అడిగారు. తప్పొప్పులను ఎత్తి చూపాల్సిన మీడియానే ఈవిధంగా తప్పు చేస్తుండటం సరికాదని శ్రీకాంత్ రెడ్డిఅన్నారు.