టీఆర్ఎస్ పేరును త్యాగం చేసి బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్‌కు.. రాజకీయంగా అదెంత పెద్ద తప్పో నిరూపించేందుకు కొంత మంది రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పేరుతో ఓ కొత్త పార్టీని ముగ్గురు కీలక నేతలు ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని అంటున్నారు. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి ..లేకపోతే తెలంగాణ రక్షణ సమితి అంటూ రకరకాల పేర్లు తెరపైకి తెస్తున్నారు. వీటిలో ఏది ఖరారు చేస్తారో తేలాల్సి ఉంది.
ముగ్గురు నేతలు ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారని చెబుతున్నారు. ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. ఆ ముగ్గురు నేతలెవరు అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ ముగ్గురు మాజీ టీఆర్ఎస్ నేతలంటున్నారు. టీఆర్ఎస్ హైకమాండ్ తీరు నచ్చక పార్టీ నుంచి వెళ్లిపోవడమో.. అవమానకరంగా వెళ్లిపోవడమే అనుభవించిన నేతలని చెబుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ జాతీయ పార్టీలో చేరినప్పటికీ ఆయన కు అక్కడ ప్రాధాన్యత లభించడం లేదు. ఆ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన లక్ష్యం కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని… టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ రాజకీయ పార్టీ అంశం ఉద్దృతంగా తెరపైకి వచ్చి.. తెలంగాణ అంశానికి దూరంగా జరగడం ఇష్టం లేని నేతలు ఈ పార్టీలో చేరితే.. బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.