ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు. తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసును చాగంటి సందర్శించారు. క్యాంప్ ఆఫీసు ను ఆనుకుని సీఎం సతీమణి భారతి నిర్వహిస్తున్న గోశాలను కూడా సందర్శించారు. చాలా బాగుందని కితాబిచ్చారు.
అయితే తాజాగా ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. సీఎం జగన్ను కలవడం అంటే.. సలహాదారు పదవిని అంగీకరించడమేనని చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా పదవిని తిరస్కరించారు. దీనికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. సలహాదారుల పదవుల విషయంలో హైకోర్టు లో విచారణ జరుగుతున్న సమయంలో కోర్టును ధిక్కరించేందుకా అన్నట్లుగా ఈ నియామకం చేయడం ఓ కారణం అంటున్నారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు.. లక్షల జీతభత్యాలు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నరు. ఈ ప్రచారం ఆయన కంట బడటంతో అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. కారణం ఏదైనా సలహాదారు పదవిని తిరస్కరించడంతో పాటు.. ఇలాంటి పదవి విషయంలో ఆయన చెబుతున్న ఓ ప్రవచనంలో వ్యాఖ్యల వీడియో వైరల్ అవడం సంచలనంగా మారింది.