కాలేజీలో పట్టుమని ఇరవై ఏళ్లు నిండని యువకుడు కుప్పకూలి చనిపోయాడు. గుండెపోటు కారణం. జిమ్ చేస్తూ పాతికేళ్లు నిండని కానిస్టేబుల్ చనిపోయారు. గుండెపోటే కారణం. మధ్య వయసు కూడా రాని టీడీపీ నేత వరుపల రాజా అలాగే చనిపోయారు. ఇక తారకరత్న గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ మీడియాలో బాగా హైలెట్ అయినవి. కానీ ఇలా చిన్న వయసులోనే చనిపోతున్న .. ముఖ్యంగా గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఇది ఎక్కువైంది.
యువతలో గుండెపోటుకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆధునిక జీవనంతో కూడిన పని ఒత్తిడి అని చాలా మంది విశ్లేషిస్తూ ఉంటారు. కానీ ఇటీవల చనిపోతున్న వారి వృత్తి, వ్యాపారాలు ఇతర వ్యాపకాలను చూస్తే.. వారెవరూ ఇంకా ఒత్తిడి జీవితంలోకి అడుగు పెట్టని వారే. ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉన్నవారే. అదే సమయంలో వారేమీ తిండి విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ నిర్లక్ష్యంగా ఉండేవారు కాదు.. అందుకే వారి మరణాల వెనుక ఆధునిక జీవనశైలి.. అనారోగ్య ఆహారపుటలవాట్లు ఉన్నాయని చెప్పలేం. అతిగా వ్యాయామం చేసే ధోరణి కూడా ఓ కారణం అని మరికొంత మంది చెబుతున్నారు. జిమ్లో ట్రైనర్స్ ఉంటారు. వారు … ఎవరికి ఎంత జిమ్ చేయాలో స్పష్టంగా ెబుతారు. నిజానికి అకాల మరణాలకు అధిక జిమ్ అనేది కారణం కానే కాదని అర్థం చేసుకోవచ్చు.
కొత్త శతాబ్దంలో మానవాళిని వణికించిన వైరస్ కరోనా. కరోనా తగ్గిపోయినా ఆ ప్రభావం ఉంటుందని చాలా కాలంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే వెలుగుచూస్తున్నాయని అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ విశ్లేషిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ల కారణంగా ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రజలు చనిపోతున్నారని సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ అది నిజమే పరిశోధనలు వెలుగు చూడలేదు. కానీ ఇలాంటి ప్రచారం భయాందోళనలు పెంచుతోంది. ,సడెన్ మరణాలకు కారణం కరోనానా.. కరోనాను తగ్గించుకునేందుకు వేయించుకున్న వ్యాక్సినా అన్నది తర్వాత సంగతి. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఇప్పడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని . ఎందుకంటే.. ఒక్క మరణం కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తుంది.