‘బలగం’ కథ తనదేనంటూ ఓ విలేఖరి వివాదం సృష్టించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఆ చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి . ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా కథ నాదంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి మీడియా ముందు ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయకపోతే కోర్టు వెళ్తానని చెప్పారు.
ఈ వ్యవహారంపై చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ.. కాకి ముట్టుడు అనేది తెలంగాణ సంప్రదాయం మాత్రమే కాదని.. తెలుగు సంప్రదాయం. ఆరేళ్లుగా ఎంతో శ్రమించి బలగం కథ తయారు చేసుకున్నాను. ఈ విషయంలో తాను కూడా కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. నిర్మాతగా దిల్ రాజుగారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ కథ రాసింది నేను. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి. దిల్ రాజుగారి వంటి పెద్ద వ్యక్తిని అబాసు పాలు చేయటానికి, ఆయన బొమ్మ పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చిల్లర వ్యక్తులు చేసే డ్రామా ఇది. ఏదైనా వుంటే దర్శకుడిగా నాతొ మాట్లాడండి. అంతేగానీ దిల్ రాజుగారిని మధ్యలో తీసుకొస్తే నేను ఊరుకోను’ అని చెప్పుకొచ్చారు వేణు.