సీబీఐ విచారణకు పిలిస్తే.. తనకు కార్యకర్తల సమావేశం ఉందని తాను రాలేనని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి తెగేసి చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మూడో సారి ఆయనను పిలిచారు. దీంతో అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి లాయర్లు కూడా ఇలాంటిదేదో ఉంటుందన్న అభిప్రాయానికి రావడంతో.. చివరికి విచారణకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనను కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లోనే విచారణ చేయనున్నారు. అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే సీబీఐ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మామూలుగా విచారణకు హాజరైతే… ఆయన అరెస్టుకు ఇతర కారణాలు చెప్పాల్సి ఉంటుంది. విచారణకు హాజరు కాకపోతే.. మాత్రం విచారణకు సహకరించడం లేదన్న కారణం చూపించి అరెస్ట్ చేయవచ్చు. కుంటి సాకులతో విచారణకు హాజరు కాకపోవడం వల్ల అవినాష్ సీబీఐకి చాన్స్ ఇచ్చినట్లవుతోందన్న వాదన వినిపిస్తోంది.
అవినాష్ రెడ్డి మొదటి సారి విచారణ కు పిలిచినప్పుడు కూడా రాలేదు. ఐదు రోజుల ఆలస్యంగా ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు మరోసారి అలాంటి సాకులే చెబుతున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి కూడా పిలిచినప్పుడు విచారణకు హాజరు కాలేదు. మొత్తానికి వివేకానందరెడ్డి హత్య కేసులో రాబోయే వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.