సినిమాల్లో గోదావరి పాటలు (పార్ట్ 1)
గోదావరికీ, సినీ పాటలకి మధ్య ఉన్న సంబంధం పాలుతేనెల బంధం. కవి తియ్యటి పాటలు రాస్తే, ఆపాటలకు గోదావరమ్మ పాలపొంగులా మురిసిపోతూనేఉంది. గోదావరి పుష్కరాలు జరుగుతున్న శుభవేళలో తెలుగు సినిమాల్లోని కొన్ని గోదావరి పాటలు లేదా కవితలను గుర్తుచేసుకుందాం. ముందుగా గోదావరి మాత పులకించే పాట ఇదిగో ఇదే…
వేదంలా ఘోషించే గోదావరి,
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
`ఆంధ్రకేసరి’ సినిమాలోని పాట ఇది. ఆరుద్రగారు గోదావరి అందాలతోపాటు రాజమహేంద్రి వైభవం కళ్లకు కట్టినట్టు రాశారు ఈ పాటలో. సత్యం సంగీతం అందించగా బాలు స్వరం అందించారు.
ఆది కవి నన్నయ్య మహాభారతానికి శ్రీకారం చుడుతూ-
`శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
యే లోకానాం స్థితిమావహంత్య
విహితాం స్త్రీపుంస యోగోద్భవాం ‘
రాసిన కావ్యరచనను ఆరుద్రగారు ఈపాట రెండవ చరణంగా ఎత్తుకుంటూ…
ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము
అంటూ కంటిన్యూ చేస్తూ, శ్రీనాధులు వంటి కవిసార్వభూములకు రాజమహేంద్రి ఎలా ఆలవాలమైందో వివరించారు.
తర్వాతి చరణంలో చిత్రాంగి కథ నిజంగా జరిగిందా, లేక కట్టుకథ అన్నది పక్కన బెడితే, చిత్రాంగి నివసించిందని చెప్పుకునే కనకమేడలు, అద్భుతమైన శిల్పాలు దేవళాలు ఇలా ఎన్నో ఈ రాజమహేంద్రిలో చూడవచ్చని రాశారు ఆరుద్రగారు. అంతేకాదు, అక్కడున్న కోటి లింగాల్లో కొన్ని కొట్టుకుపోవచ్చేమోకానీ, తెలుగువారికి ఘనమైన సంపదగా మిగిలాడొక వీరేశలింగం గారంటూ ఈ పాటకు ముగింపు పలకడంతో తెలుగువారి మది గోదావరిలా ఒప్పొంగడం ఖాయం.
ఆంధ్రకేసరి సినిమా 1983లో రిలీజ్ అయింది. విజయచందర్ ప్రధానపాత్ర పోషించారు. ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో మురళీమోహన్, చంద్రమోహన్, రాజబాబు, రమణమూర్తి, సాక్షి రంగారావు, రావి కొండలరావు, అన్నపూర్ణమ్మ వంటివారు కూడా నటించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ పాటను మనమంతా తప్పకుండా వినాల్సిందే. ఇది వింటూ ఉండండి, మరోసారి ఇంకా పాటను ప్రస్తావిస్తాను.
– కణ్వస