నటి ఖుష్బూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న తనంలో నాన్న తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదనని వెళ్లగక్కారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఖుష్బూ మనసు విప్పారు. లైంగిక వేధింపులు తనకీ తప్పలేదని, ఆఖరికి తన తండ్రి చేతుల్లోనే శారీరకంగా, మానసికంగా హింసకు గురయ్యానంటూ భావోద్వేగభరితంగా చెప్పారు.
”ఎనిమిదేళ్ల వయసులో నేను లైంగికంగా వేధింపులకు గురయ్యాను. అది కూడా నా కన్న తండ్రి వల్ల. ఈ విషయం అమ్మకి చెబితే నమ్ముతుందో లేదో అని భయపడ్డాను. భార్యలు భర్తల్ని దైవంగా భావిస్తారు. వాళ్లేం చేసినా గొప్పగానే ఉంటుంది. మా అమ్మ కూడా అలాంటిదే. భార్యాబిడ్దల్ని వేధించడం జన్మ హక్కుగా భావించే ఓ వ్యక్తి వల్ల నేనూ, అమ్మ చాలా బాధ పడ్డాం. పదహారేళ్ల వయసులో నేను తిరగబడడం నేర్చుకొన్నా. దాంతో.. నన్నూ, మా అమ్మని వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి వెళ్లాక చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, వాటన్నింటినీ భరించి ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని గుర్తు చేసుకొన్నారు ఖుష్బూ.