రాజన్న పాలన తెస్తానంటూ తెలంగాణలో రాజకీయం చేస్తున్న వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసుకుంటున్న ప్రచారం కోపం తెప్పిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతమని రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్నారు. ఆయనపై ప్రజల్లో అభిమానాన్ని షర్మిల వైపు పోకుండా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన జీవితం అంతా కాంగ్రెస్ కోసమే బతికారని..కాంగ్రెస్ తరపునే పథకాలు ప్రవేశ పెట్టారని.. కాంగ్రెస్ నేతగానే మరణించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడుఆయన వారసులమటూ కొంత మంది వస్తున్నారని వారికి తెలంగాణతో ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు.
ఇది షర్మిలకు కోపం తెప్పిస్తోంది. వైఎస్ఆర్ వారసత్వాన్ని అంది పుచ్చుకుని రాజన్నపాలన తెచ్చేందుకు తాను పార్టీ పెట్టుకుని ప్రయత్నిస్తూంటే.. వైఎస్ఆర్ లెగసీని సొంతం చేసుకునేందుకా అన్నట్లుగా రేవంత్ ప్రకటనలు చేయడంతో ఆమె మండిపడుతున్నారు. రేవంత్ పై ఘాటు భాషలతో సోషల్ మీడియాలో తిట్లందుకున్నారు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారని షర్మిల హెచ్చరించారు. పాదయాత్ర చేసి ప్రభుత్వంపై పోరాటం చేసింది వైఎస్ఆర్ బిడ్డ మాత్రమేనని షర్మిల చెబుతున్నారు. మొత్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టి పెరిగి..సీఎం అయితే.. ఆయన చనిపోయిన తర్వాత అసలు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని ఆయన వారసులు ఒకరు ఏపీలో. … మరొకరు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. వైఎస్ఆర్ మావాడన్న కాంగ్రెస్ నేతలపై తిట్లందుకుంటున్నారు.