2019 జనవరిలో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసును ఒక్క రాకేష్ రెడ్డి మాత్రమే చేశారని కోర్టు నిర్ధారించింది. మిగిలిన పదకొండు మంది నిందితులని నిర్దోషులుగా వదిలి పెట్టింది. బాకీ ఉన్న డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్న జయరామ్ ను హనీ ట్రాప్ చేసి.. ఇంటికి పిలిపించి హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కృష్ణా జిల్లాలో కారును ఆ పక్కకు వెళ్లేలా చేసి రాకేష్ రెడ్డి పరారయ్యాడు. కానీ పోలీసులు విచారణ జరిపి నేరాన్ని తేల్చారు.
ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు అప్పట్లో మీడియాలో ప్రచారం అయ్యాయి. సినిమాల్లో అప్పట్లో నటుడిగా పేరు తెచ్చుకుంటున్న సూర్య ప్రసాద్.. అమ్మాయి గొంతుతో మిమిక్రి చేసి హనీ ట్రాప్ చేసి.. జయరామ్ ను రాకెష్ రెడ్డి గుప్పిట్లో పడేలా చేశారని చెప్పుకున్నారు. కుక్కలకు ఇచ్చే ప్రమాదకరమైన ఇంజెక్షన్ తో హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి జయరామ్ ను కృష్ణా జిల్లాలో పడేయడానికి పోలీసుల సహకారం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఓ ఏసీపీ, ఇద్దరు సీలు రాకేష్ రెడ్డికి సన్నిహితులు కావడంతో వారిపై శాఖారపరమైన చర్యలు తీసుకున్నారు. కానీ కోర్టులో మాత్రం వారిపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో రాకేష్ రెడ్డి మినహా అందరూ నిర్దోషులయ్యారు.
చిగురుపాటి జయరాం ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ గా ఉండేవారు. అప్పటికే ఎక్స్ ప్రెస్ టీవీ మూతపడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జయరామ్ సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఎక్స్ప్రెస్ టీవీ ప్రారంభించి నష్టాలు రావడంతో మూసేశారు. అమెరికాలో . ఔషధాలు, అద్దాల తయారీ పరిశ్రమల్లోనూ వాటాలున్నాయి. భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండేవారు. ఇండియాలో వ్యాపారల కోసం తరచూ వచ్చే వారు. అయితే ఇక్కడ వ్యాపారాల్లో వచ్చిన సమస్యలు ఇతర సమస్యల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. చివరికి హత్యకు గురయ్యారు.