ఏపీ అధికార పార్టీ నాలుగేళ్లుగా అవినీతిని తవ్వుతూనే ఉంది కానీ.. ఎలకను కూడా పట్టలేదు.కానీ ఈ కేసుల పేరు చెప్పి అధికారవర్గాల్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని వారితో తప్పుడు పనులను చేయించుకుంటోందన్న ఆరోపణలు, అనుమానాలు మాత్రం చాలా కాలంగా వస్తున్నాయి. తాజాగా ఆర్జా శ్రీకాంత్ అనే అధికారిపై గురి పెట్టింది. ఆయనకు రేపో మాపో సీఐడీ నోటీసులు ఇవ్వబోతోందని బ్లూ మీడియాలో బ్రేకింగ్‌లు వేయించడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఆయన పని చేశారు. ఈ ప్రభుత్వంలోనూ కోవిడ్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారు.
ఆయన ప్రభుత్వం చెప్పినపని చేయలేదో.. లేకపోతే.. మరో వ్యూహమో కానీ ఆయన పేరు ఇచ్చి మరీ మీడియాలో బ్రేకింగ్‌లు వేయడం ప్రారంభించారు. దీనికి తోడు కేంద్ర ఐటీ శాఖ కూడా దృష్టి పెట్టిందని సమాచారం అంటూ గాసిప్స్ రాస్తున్నారు. స్కిల్ డెలవప్ మెంట్ స్కాం పేరుతో గతంలోనే సీఐడీ కొన్ని విచారణలు చేసింది. అవినీతి జరిగిందని చెబుతున్నారు కానీ.. రూపాయికి కూడా సాక్ష్యాలు చూపించలేదు. వీరు నమోదు చేసిన కేసును ఈడీకి పంపారు. ఈడీ కూడా విచారణ జరిపింది.
కానీ ఎక్కడైనా సీఐడీ చెప్పినట్లుగా లొసుగులు బయటపడ్డాయా.. మనీ లాండరింగ్ జరిగిందా అన్నది తేల్చలేదు. పైగాఈ స్కాం వేల కోట్లు అని బ్లూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ మొత్తం మీద ఖర్చు పెట్టింది.. చాలా తక్కువ అని.. మొత్తం విషయాలను టీడీపీ ఎప్పుడో బయట పెట్టింది. అయితే.. ఈ స్కాం పేరుతో.. తరచూ బ్రేకింగ్ లు వేయించి.. ఏదో కేసుతో సంబంధం లేని ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు ఇలాంటి పరిణామాల వల్ల కలుగుతున్నాయి.