ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని గొప్ప సక్సెస్ చేశామని.. ఏపీ పారిశ్రామిక నగరం అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నేతలు.. అసలు ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయో చెబుతున్నారు కానీ.. అవేమిటో మాత్రం చెప్పడం లేదు. మొత్తం 352 అవగాహనా ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 74 కంపెనీల పేర్లను మాత్రమే ప్రకటించారు. మిగతా వాటి సంగతి ప్రకటించలేదు. ప్రకటించిన ఈ కొద్ది కంపెనీల చరిత్రనే బయటకు తీసి.. ప్రజల ముందు పెడుతోంది మీడియా, సోషల్ మీడియా. వాటి గురించి కూడా బయట పెడితే నిజాలేమిటో తెలుస్తాయి.
ప్రభుత్వం ప్రకటించకపోయినా… కొంత మంది తాము ప్రభుత్వంతో ఎంవోయూ లు చేసుకున్నామని చెబుతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఫిల్మి మోజీ అనే యూ ట్యూబ్ చానల్. యూట్యూబ్ చానల్ పెట్టే పెట్టుబడులేంటి… దానికి ప్రభుత్వంతో చేసుకోవాల్సిన ఎంవోయూ ఏంటి అనే డౌట్ సహజంగానే వస్తుంది. దీనిపై పిల్మి మోజీ ఓనర్ కూడా ఏమీ చెప్పడం లేదు. ఎంత పెట్టుబడి… ఎలా పెడతారన్నదానిపై ఆయన నోరు విప్పడం లేదు. ఇక యాంకర్ శ్యామలారెడ్డి ఖాతాలో ఓ ఎంవోయూ ఉందని చెబుతున్నారు. దేశాలు తిరుగుతూ.. తన దగ్గర డబ్బుల్లేవని… తన ఖాతాల్లో డబ్బులు వేయాలని వీడియోల ద్వారా అడిగే రవి ట్రావెలర్ అనే వ్యక్తితోనూ ఎంవోయూ చేసుకున్నారని చెబుతున్నారు
ఇలా చిన్నా చితకా వ్యక్తులతో కూడా ఎంవోయూలు చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ ఇటీవల ప్రారంభించిన ఓ నూడిల్స్ బండి ఓనర్ కూడా ఎంవోయూ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అసలు ఎంవోయూలు చేసుకున్న కంపెనీల గురించి సీక్రెట్ గా ఉంచడంతోనే ఇలాంటివన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం వివరాలు బయటపెడితే.. .. కంపెనీల జాబితా.. వాటి ప్రపోజల్స్ గురించి చెబితే.. అందరికీ అన్నీ తెలుస్తాయి. కానీ ప్రభుత్వం మాత్రం దాచుకునే ప్రయత్నం చేస్తోంది