జఫ్ఫా అంటే.. జగన్ ఫాలోవర్ అని అర్థం చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నేత దేశపతి శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ఆయన చేసిన ప్రసంగాలు.. రాసి పాడిన పాటలు మార్మోగేవి. అలాంటి నేతకు ఇప్పటి వరకూ కేసీఆర్ ఎలాంటి పదవి ప్రకటించలేదు. ప్రభుత్వ టీచర్ గా ఉన్న ఆయనను.. సీఎంవోలో ఓఎస్డీగా పెట్టుకున్నారు. తర్వాత వీఆర్ఎస్ ఇప్పించారు. కానీ పదవి మాత్రం ఇవ్వలేదు.
ఎప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా ఆయన పేరు వినిపిస్తుంది.కానీ కేసీఆర్ అవకాశం కల్పించలేదు. ఇప్పటికి ఆయనకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేకోటాలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అన్నీ టీఆర్ఎస్కే లభిస్తాయి. ఒక స్థానం దేశపతి శ్రీనివాస్‌కు మరో స్థానం.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర్మయ్యగారి నవీన్ కుమార్ కు కేటయించారు. మరో స్థానం మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డికి ఇచ్చారు. ఆయన ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు.
ఇంకా గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఒకటి ఖమ్మం జిల్లాకుచెందిన తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయిస్తారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు ఫార్ములాతోనే అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.