ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు సభ నుండి ఏడాది కాలంపాటు సస్పెండ్ చేయబడిన వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని సోమవారంనాడు విచారణకు చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఆ కేసును మార్చి 9కి వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి ఆయన నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరారు.
మార్చి 5వ తేదీ నుండి రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. కానీ హైకోర్టు ఈకేసును మార్చి9కి వాయిదా వేయడం చేత ఆమె సభలో ప్రవేశించలేరు. ఆమెపై కటినచర్యలు తీసుకోవలసిందిగా శాసనసభ కమిటీ సిఫార్సు చేసింది కనుక ఈసారి శాసనసభ సమావేశాలు మొదలవగానే స్పీకర్ ఆమెపై విధించిన ఏడాది సస్పెన్షన్ని ఖరారు చేయవచ్చును.
ఆమె స్పీకర్ ని కలిసి జరిగినదానికి క్షమాపణలు చెప్పుకొని తనపై విధించిన సస్పెన్షన్ని ఎత్తివేయించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ఆమె స్పీకర్ తో యుద్ధానికే సిద్దపడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె విషయంలో రాజ్యాంగ ప్రకారం స్పీకర్ కే తగిన నిర్ణయం తీసుకొనే హక్కు ఉంటుంది కనుక ఒకవేళ స్పీకర్ ఆమెపై విధించిన సస్పెన్షన్ని ఖరారు చేసినట్లయితే ఆమెను ఏ న్యాయస్థానం కాపాడలేదు. ఈ సంగతి అపార రాజకీయానుభవం ఉన్న రోజాకి, వైకాపాకి తెలియదనుకోలేము. అయినా ఆమె స్పీకర్ తో రాజీ పడేందుకు ప్రయత్నించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అంటే ప్రజల దృష్టిని ఆకర్షించి వారి సానుభూతి పొందేందుకేనని అనుమానించవలసి ఉంటుంది.