పీలేరు నియోజకవర్గం… భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చింతపర్తి విడిది కేంద్రం వద్ద మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మహిళలకు నారా లోకేష్ పాదాభివందనం చేశారు. రాజకీయాల్లో లేకున్నా కూడా తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా వైసిపి నాయకులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని, చిన్న వయస్సు నుండే మగవాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ బుధవారం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అమ్మలేకపోతే మనకు జన్మలేదని, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలు మోస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని, మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ఈ సందర్భంగా లోకేష్ ప్రశ్నించారు.
జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయి. మరో 900 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయి. సిఎం సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అడిగిన ప్రశ్నలు.. లేవనెత్తిన సందేహాలకు లోకేష్ సమాధానం ఇచ్చారు.
లోకేష్ ఏ మహిళలకు పాదాభివందనం చేసి.. తనకు ఉన్న గౌరవాన్ని ఏ మాత్రం బేషజం లేకుండా వ్యక్తం చేయడం మహిళల్ని సంతోషపరిచింది. సొంత తోబుట్టువుగా లోకేష్ వ్యాహరశైలి ఉండటం చూసే వారికీ మన మనిషి అనే అభిప్రాయాన్ని కల్పించింది.