కాబోయే సీఎం కేటీఆర్ అనే మాట బీఆర్ఎస్ నేతల నోటి నుంచి తరచూ వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రకటనలు చేయాలంటే.. ఆషామాషీగా చేయరు. వారికేదో సంకేతాలు వస్తేనే చేస్తారు. తాజాగా ఎర్రబెల్లి సహా కీలక మంత్రులు ఇదే ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ మంత్రుల ప్రకటనలు వ్యూహాత్మకమేనని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేటీఆర్ సీఎం అనే మాట గత ఐదారేళ్లుగా వినిపిస్తూనే ఉంది. గ గత ఏడాది టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా కేటీఆర్ సీఎం అనే ప్రకటనలు చేశారు. కొన్ని రోజులు దీనిపై చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ ఆ అంశంపై మాట్లాడవద్దని ఆదేశించడంతో సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కేటీఆర్ సీఎం అనే వాదనను తెరపైకి తెస్తున్నారు.
తెలంగాణలో కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. ముందస్తు లేకపోయినా మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ అంశంపై కేసీఆర్ సీరియస్గా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుంది. ఒక వేళ అసెంబ్లని రద్దు చేయకపోతే.. కేటీఆర్ ను సీఎం చేసి.. కేటీఆర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా కొంత కాలంగా బీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తనకు జాతీయ రాజకీయాలు ఓ టాస్క్ అని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు కావొచ్చు.. ఇతర కారణాలు కావొచ్చు కానీ బీఆర్ఎస్ పై పూర్తి స్తాయిలో దృష్టి పెట్టలేకపోతన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. పర్యటించాల్సి ఉంటుంది. సీఎంగా ఉంటూ పూర్తి స్థాయిలో అలా చేయడం కష్టమవుతుంది. అందుకే కేసీఆర్ సీఎం బాధ్యతల్ని కేటీఆర్ కు ఇచ్చి తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై అవగాహనకు రావడంతోనే మంత్రులు కేటీఆర్ సీఎం అనే ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు యాధృచ్చికంగా చేస్తున్నారా లేకపోతే వ్యూహాత్మకంగా చేస్తున్నారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.