ప్రభుత్వ ఉగాది వేడుకలు విశాఖలో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఉగాది పండుగ జరగనుంది. సాధారణంగా ప్రతీ ఏడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగశ్రవణం జరుగుతుంది. ఎప్పుడూ ఇది ఫలానా చోట జరగాలనే వివాదం ఏర్పడలేదు. కానీ ఈ సారి మాత్రం విజయవాడలో కాకుండా విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తానని జగన్ చెబుతూ వస్తున్నారు. అది ఉగాదికే ముహుర్తం ఖరారయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఆ లెక్కన ఈ ఉగాది వేడుకల్లో సీఎం విశాఖలో పాల్గొనడాన్ని పరిపాలనా పరమైన కార్యక్రమంగా ప్రకటించుకుంటారేమో తెలియదు కానీ.. మొత్తానికి సీఎం జగన్ మాత్రం క్యాంప్ ఆఫీసును చూసుకున్నారని ఇల్లు కూడా రెడీ అయిందని చెబుతున్నారు. కొంత కాలంగా అధికారులు విశాఖలో రహస్య పర్యటనలు చేస్తున్నారు., ఈ నెలాఖరులోనే జీ 20 సన్నాహాక సదస్సు రెండు రోజుల పాటు విశాఖలోనే జరగనుంది. అంతకు ముందే విశాఖకు క్యాంప్ ఆఫీసును మార్చుకుంటారా లేకపోతే వివాదాలెందుకని… తర్వాత మారుస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ముందూ వెనుకా చూసుకోకుండా మూర్ఖంగా విశాఖ నుంచి పాలన అంటున్న సీఎం జగన్ కు వాస్తవంలోనే పరిస్థితులు అర్థమవుతాయని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే సీఎం పదవిలో ఎంతో కాలం ఉండలేరని అంటున్నారు. రెండు రోజులు విశాఖ నుంచి ఒక్కరే ఎలా పరిపాలన చేస్తారని.. రెండు రోజుల కోసం వ్యవస్థ అంతా అమరావతి నుంచి విశాఖ ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత గందరగోళంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.