బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందేమోనని అవినాష్ రెడ్డి వణికిపోతున్నారు. మూడో సారి ఆయన విచారణకు వెళ్లే సమయం దగ్గర పడటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్ వేశారు. తనకు సీబీఐ 160 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని.. ఆ నోటీసులు ఇస్తే అరెస్ట్ చేయకూడదని ఆయన చెబుతున్నారు. కానీ ఆ సెక్షన్ కింద నోటీసులిచ్చినా విచారణకు సహకరించలేదన్న కారణం చూపి అరెస్ట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో తుది ప్రయత్నంగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. అలానే ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ సారి అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేపుతోంది. వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ రెడ్డినే హత్య చేశాడని తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.