నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేసింది. జనవరి 27వ తేదీన ప్రారంభమైన యాత్ర విరామం లేకుండా సాగుతోంది. మధ్యలో తారకరత్న చనిపోవడంతో రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. అంతకు మించి ఒక్క రోజు కూడా ఆగలేదు. రోజులో పద్దెనిమిది గంటల పాటు ప్రజల మధ్యనే లోకేష్ ఉంటున్నారు. యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గం చిన్న తిప్ప సముద్రం-2 వద్ద 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తున్నలోకేష్.. వాటిపై తాను ఇచ్చిన హామీలను రాయిస్తున్నారు. ఐదువందల కిలోమీటర్ల శిలాఫలకంపై కూడా హామీలను చెక్కించారు. మదనపల్లె నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ హామీకి గుర్తుగా శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. లోకేష్ తాను ఇస్తున్న హామీలను ప్రతి వంద కిలోమీటర్ కు శిలాఫలకంపై చెక్కించి పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకపోతే.. ఆ శిలాఫలాకాలను చూపించి.,.. ప్రశ్నించే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ఇచ్చిన హామీలన్నింటినీ తాను అమలు చేయగలనని నమ్మకం లోకేష్ కల్పిస్తున్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తానో కూడా చెబుతున్నారు.
అంతకు ముందు చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని.. వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు. తిప్ప సముద్రం-2 వద్ద ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్రా స్టాల్ తో సెల్ఫీ దిగి ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఫిష్ ఆంధ్ర మూతబడిపోయిందన్నారు.