తెలంగాణ కేబినెట్ ప్రజలకు రూ. లక్షలు ఇచ్చే పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు.. ఆర్థిక సాయం చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దళితబంధులో 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుకు పది లక్షలు వస్తాయి. పోడు భూముల పట్టాల పంపిణీ, ఆక్రమించిన స్థలాల క్రమబద్దీకరణ, కాశీ, శబరిమలలో రూ. 25 కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల ఏర్పాటు కు కూడా నిర్ణయంతీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ లబ్దిదారులకు ఇచ్చింది లేదు. ఇప్పుడు కొత్తగా గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షలు ఇస్తామంటున్నారు.
ఇవన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టాల్సిన పథకాలు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా కొంత మంది లక్షలు ఇచ్చి మెజార్టీ వర్గం వారిని అసంతృప్తి కి గురి చేస్తున్నారని తమకేంటి అనే ఫీలింగ్ కల్పిస్తున్నారని బీఆర్ఎస్ లోని ఓ వర్గం ఆందోళనకు గురవుతుంది. అయితే కేసీఆర్ మాత్రం…ఆ కొద్ది మదిని చూసి.. తమకూ ఇస్తారన్న ఆశతో అందరూ బీఆర్ఎస్ నే ఎంచుకుంటారని అనుకుంటున్నారు.