తనదాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా రాజకీయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా తిరుగే లేదన్నట్లుగా అప్రతిహతంగా రాజకీయం చేసి.. అధికారం అండతో ప్రతిపక్షాలను ఎంతగా నిర్వీర్యం చేయవచ్చో అంతా చేసినా భారత రాష్ట్ర సమితి నేతలు ఇప్పుడు తమపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీలో చేరిన వారిపై కేసులు, విచారణలు ఎందుకు ఉండవని ప్రశ్నిస్తున్నారు. ఎంత వేధించినా బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఇదంతా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత రేపోమాపో అరెస్ట్ కాబోతోందన్న అభిప్రాయంతోనే చేస్తున్నారు. అయితే ఇంత కాలం వారేం చేశారన్న విషయం పక్కన పెడితే.. మన దేశ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల నిష్ఫాక్షికత ప్రశ్నార్థకం కావడానికి తలా పాపం తిలా పిడికెడ్ పంచాల్సిందే. అధికారం అందిందని దాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్రయత్నంలో… దర్యాప్తు సంస్థలను కట్టు బానిసలుగా చేసుకుని.. తమ రాజకీయ అవసరాలు తీరే కేసులను మాత్రమే పరుగులు పెట్టిస్తూ.. ఇతర కేసుల్ని పక్కన పడేయడంతోనే అుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు తప్పు అని ఎవరూ చెప్పడం లేదు. ఇతర కేసుల సంగతేమయిందనే అంశాన్నే ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ సరే.. మరి ఇతర కేసులెందుకు సాగవు !?
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ శరవేగంగా సాగుతోంది. వరుస అరెస్టులు జరుగుతున్నాయి. శరవేగంగా విచారణ జరుగుతోంది. ఈ అంశంపై మోదీ, బీజేపీ, దర్యాప్తు సంస్థలపై ఆప్, టీఆర్ఎస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేయవచ్చు. కానీ వారు ఈ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని కొట్టి పారేఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్లింది. విపక్షాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలతో కార్నర్ చేస్తుందనేది కళ్ల ముందు కనిపించే నిజం. ఎనిమిది సంవత్సరాల ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 124 CBI కేసుల్లో 118 ప్రతిపక్షాల నాయకుల మీదనే మోపబడ్డాయి . 121 E.D కేసుల్లో 115 విపక్ష నేతలపైనే ఉన్నాయి. ఏదయినా తనదాకా వస్తే కాని నొప్పి తెలియదన్నట్లుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు పెడబొబ్బలు పెడుతున్నారు. పొట్టోడిని పొడుగోడు కొడితే , పొడుగోడిని పోచమ్మ కొడుతుందన్నట్లుగా ఎవరికి ఎక్కువ అధికారం ఉంటే.. వారిదే కర్రపెత్తనం.. కేసులన్నట్లుగా వ్యవస్థ మారిపోయింది. యలేరు. కానీ ఇతర కేసుల విచారణలు ఎందుకు జరగడంలేదని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. విపక్షాల మీదనే ఎందుకు దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తున్నారని అడుగుతున్నారు. దీనిపై సమాధానం మాత్రం కేంద్రం వద్ద నుంచి రావడం లేదు. బీజేపీలో అసలు అవినీతి పరులు లేరా అనే దానికి సమాధానం ఎవరు చెబుతారు ? బీజేపీ కాపాడుతున్న రాజకీయ నేతల అవినీతిపై విచారణలు ఎందుకు ముందుకు సాగడం లేదన్న అంశంపై ఎవరు స్పందిస్తారు ?
అవినీతిపై మోదీ చెప్పే పాఠాలు అద్భుతం – చేతుల్లో ఏకపక్షం!
” చిన్న కుంభకోణాన్ని చేసినప్పుడు విస్మరిస్తే.. అది పెద్ద కుంభకోణాలు చేయడానికి దోహదం చేస్తుంది..! కొద్దిగా అవినీతికి అలవాటు పడిన వారిపై.. దొరికినా ఏమీ చర్యలు తీసుకోకపోతే.. వారు ధైర్యంగా మరింత అవినీతి చేస్తారు..” అని దర్యాప్తు సంస్థల అధికారుల సమావేశంలో ఓ సారి వ్యాఖ్యానించారు.కానీ దేశంలో జరుగుతోంది మాత్రం వేరే. అవినీతి కేసుల బారిన పడి బీజేపీ చేరిన ఎంతో మంది పునీతులైపోయారు. కేసులు ఎదుర్కొని బీజేపీలో చేరిన వాళ్లు కానీ.. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న వారు కానీ..ఎప్పుడైనా విచారణకు హాజరవడం చూశారా ? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ నేత. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు., బీజేపీలో చేరిపోయారు. బిజెపిలో చేరిన తర్వాత ఈడీ కానీ, సిబిఐ కానీ ఆయనను ఒక్కసారి కూడా పిలిపించలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై కేసులున్నా ఆయనకు సమన్లు లేవు. నారాయణ్ రాణే, రామన్ సింగ్, ముకుల్‌రాయ్, సువేందు అధికారిలపై కూడా కేసులున్నాయి. వారు ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు సమన్లు మీద సమన్లు వెళ్లాయి. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదు. వారి సంగతి ఎందుకు మన తెలుగు రాష్ట్రాల సంగతే చూసుకుంటే.. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి వెంట పడిన సీబీఐ… బీజేపీలో చేరిన తర్వాత ఆయనను ఒక్క సారి కూడా ఎందుకు ప్రశ్నించారు. కళ్ల ఎదుట కనిపించే ఆధారాలతో దొరికిపోయిన జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు సైతం వెళ్లడం లేదు. న్యాయవ్యవస్థనే నిర్వీర్యం చేసేంత సాహసానికి ఎలా ఒడిగట్టగలిగారు ?. అది ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాదు… హత్యలు, అత్యాచారాలు లాంటి దారుణమైన ఘటనలకు పాల్పడే వారికి కూడా బీజేపీ ఓ షెల్టర్‌గా మారిపోయింది. బీజేపీలో చేరే వారే కాదు.. వారి రాజకీయ అవసరాలు తీర్చే వారిలో అవినీతి పరులు ఉన్నా రక్షిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం బొక్కేసి.. నిర్భయంగా రాజకీయాలు చేస్తున్నవారు.. విచారణలు ఆలస్యం చేసుకుంటూ ఇంకా ఇంకా దోపిడికి పాల్పడుతున్న వారు కళ్ల ముందే ఉన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా.. వారిని రాజకీయ అవసరాల కోసం కాపాడుతూనే ఉన్నారు. కానీ బయటకు మాత్రం… అవినీతిని అంత మొందిస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ధైర్యం ఎవరి వల్ల వస్తుంది.కేవలం కేంద్రంలో ఉన్న అధికార పెద్దలు ఇచ్చే భరోసా వల్లే వస్తుంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే పరిస్థితి.. కానీ బీజేపీది ఎక్స్ ట్రీమ్ లెవల్ !
గడిచిన 18 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హయాంలో దాదాపు 200 మంది కీలక రాజకీయ నాయకులపై సీబీఐ కేసు నమోదు చేసి, అరెస్టు, దాడులు చేసి, విచారణ జరిపింది. ఇందులో 80 శాతానికి పైగా ప్రతిపక్ష పార్టీల నేతలే . కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సొంత పార్టీ నేతల్ని జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎన్డీఏ బాధ్యతలు చేపట్టాక సొంత నేతల్ని కాపాడటం.. పార్టీలో చేరిన రక్షించడం.. విపక్షాలను వేధించడం ఓ ట్రెండ్ అయిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004-2014 మధ్య కనీసం 72 మంది రాజకీయ నాయకులపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. వారిలో 43 మంది ప్రతిపక్షానికి చెందినవారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ-2 ఎనిమిదేళ్ల పాలనలో సుమారు 124 మంది ప్రముఖ నాయకులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వారిలో 118 మంది ప్రతిపక్షానికి చెందినవారు ఉన్నారు. అంటే 95 శాతం మంది ప్రతిపక్షానికే చెందిన వారు. యూపీలో హయాంలో 2జీ కుంభకోణం, కామన్ వెల్త్ గేమ్స్, బొగ్గు గనుల కేటాయింపు వంటి స్కామ్ లు అంటూ ప్రచారం జరిగింది. ఇవేమీ తేలలేదు కానీ కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ నేతలు అరెస్టయ్యారు. ఎన్డీఏ-2 ప్రభుత్వం వచ్చాక సీబీఐ దాడులు ఊపందుకున్నాయి. విచారణలో ఉన్న 118 మంది కీలక ప్రతిపక్ష నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం పాపం రాష్ట్ర ప్రభుత్వాలదీ కూడా !
ఈ పాపం ఎవరిది అంటే.. అధికారం చేతికి అందగానే కన్నూమిన్నూ కానరాకుండా.. ప్రత్యర్థుల్ని అధికారబలంతో ఏదో చేయాలనుకునే వారి వల్లే వస్తోంది. “పవన్ ఈజ్ నో పవర్ అన్లెస్ ఇట్ ఈజ్ మిస్ యూజ్డ్ అండ్ అబ్యూజ్డ్” అని రాజకీయాల్లో అనుకుంటూ ఉంటారు. దుర్వినియోగం చేయకపోతే ఆ అధికారం అధికారమే కాదు . ఎవరు చేయరు అధికార దుర్వినియోగం అనే ప్రశ్నలు సహజంగానే వినిపిస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాలలోని ప్రతిపక్షాల మీద ఇలా దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి. . అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికార పక్షమే. వీరు మరి వీరు చేతిల్లో ఉన్న పోలీసు, దర్యాప్తు సంస్థల్ని తమ విపక్షాలపై ప్రయోగించడం లేదా ? అని ప్రశ్నించుకుంటే.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పుకోవాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి వారిపై ఎన్ని రకాల కేసులు పెట్టాలో.. అన్నీ పెట్టి.. నిఘా సంస్థల్ని..పోలీసుల్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి అప్పుడు విపక్షాల హక్కులు గుర్తుకు కాలేదా అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు ఉంటే టీఆర్ఎస్ లో ఉండాలి లేకపోతే ఎన్ని రకాల వేధింపులు ఉంటాయో అన్నట్లుగా రాజకీయం చేశారు. ఇందులో పోలీసుల పాత్ర.. దర్యాప్తు సంస్థల పాత్ర కొట్టి వేయలేం. ఇప్పుడు ఏపీలో అంతకు మించి జరుగుతోంది. కేంద్రం కూడా అంతే. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు మోదీకి విపక్షమే కానీ.. రాష్ట్రాల్లో అధికార పార్టీలు. నిజంగానే రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారా?
తన,పర అనే తారతమ్యం లేకుండా అవినీతిపై గురి పెట్టినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది !
బలమైన ప్రధానిగా ఉన్న మోదీపై తమ పార్టీ వాళ్లుచేస్తే నీతి ఇతరులు చేస్తే అవినీతి అనే భావనలో ఉంటే దేశంలో అవినీతిపై ఎంత యుద్ధం చేసినా ప్రయోజనం ఉండదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనుకుంటే.. అవినీతి పరుల్ని తరిమేయాలనుకుంటే.. అడ్డుకునేవారు లేరు. బీజేపీ కి రాజకీయ అవసరాల కోసమో… తన ప్రత్యర్థుల్ని ఎదుగకుండా చేయాలన్న లక్ష్యంతోనే అవినీతి పరులకు అండగా ఉండాలని అనుకుంటే.. ఆయన చెప్పినట్లుగా అది ఇంకా ఇంకా భారీ కుంభకోణాలకు దారి తీస్తుంది. అంతిమంగా దేశానికి నష్టం కలిగిస్తుంది. రాజు ఎప్పుడూ రాజధర్మం పాటించాలి. సొంత రాజ్యంలో కొంత మందిని శత్రువులుగా.. మరికొంత మంది మిత్రులుగా చూసి.. చట్టాన్ని శత్రువులకు మాత్రమే వర్తింప చేస్తే రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. చరిత్ర చెప్పిన పాఠాలు ఇవే. చరిత్రదేముంది మార్చేస్తే మారిపోతుందనుకుకునే తెగింపు వచ్చేసిన ఈ రోజుల్లో రేపేం జరిగిదే మాకెందుకు ఈ రోజు అధికారం అనుభవించామా లేదా అన్నట్లుగా పాలకుల మైండ్ సెట్ మారిపోయింది. ఈ రోజు బాధలు పడిన వారు.. రేపు రంగంలోకి దిగకుడా ఉంటారా ? అధికారం అందితే… తమకు చూపించిన లెక్కల కన్నా.. రెండింతల లెక్కలు విపక్షంగా మారిన అధికారపక్షంకి చూపిస్తారు. ఇందులో ఎవరు నష్టపోతారు.. ఎవరు లాభపడతారు అన్న సంగతి పక్కన పెడితే.. దేశ ప్రజాస్వామ్యమే బలహీనం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిని వీడకుండా ఉంటే ప్రభు త్వం గౌరవం మరింత పెరుగుతుంది. అన్ని ప్రభుత్వాలకూ ఇది వర్తిస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆధారాలను బయట పెట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రజల్లో విశ్వాసం పెంచడానికి… పార్టీలతో సంబంధం లేకుండా అవినీతి పరులందరిపై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. జైల్లో వేయాలి. అప్పుడే ఇలాంటి దర్యాప్తులపై పూర్తిస్థాయిలో జనామోదం వస్తుంది. లేకపోతే కక్ష సాధింపులు.. రాజకీయ వ్యూహాల కోసం దర్యాప్తు సంస్థల వినియోగం అన్న కోణంలోనే ఆగిపోతాయి. ఇది దేశానికి మంచిది కాదు.