అమరావతిని నిర్వీర్యం చేసిన ఏపీ ప్రభుత్వం … రోడ్డు, రైలు మార్గాలను కూడా ఆపేసింది. అనంతపురం టు అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నాలుగేళ్లుగా మూలనపడి ఉంది. రైల్వే ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన పని లేదు. కొంత డబ్బులు ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉండటంతో పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులతో అమరావతి రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోకపోయినా సొంతంగా చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ అయిష్టం కారణంగా ఇంతవరకు పట్టాలెక్కని అమరావతి నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ బైపాస్ రైల్వేలైన్ కింద దీన్ని సొంతంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని త్వరలోనే రైల్వే బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లన్నారు. టీడీపీ హయాంలో కేంద్ర బడ్జెట్లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్ కేటాయించారు. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు. విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. 2017-18 బడ్జెట్లో బడ్జెట్ను కేటాయించారు. కానీ వైసీపీ వచ్చాక ఆగిపోయింది.
ఏపీ ప్రభుత్వం సహకరించకపోయినా…. రైల్వే శాఖ ముందుకెళ్లాలని నిర్ణయించింది. విజయవాడ బైపాస్ వల్ల విజయవాడ స్టేషన్ మీద రద్దీ తగ్గించవచ్చు. మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచవచ్చని రైల్వే అధికారులు నివేదికలు పంపుతున్నారు. దీంతో అమరావతి రైల్వే విషయంలో ముందడుగు పడుతున్నట్లవుతోంది.