ట్విట్టర్లో రెండు మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారని జనసైనికులు సంబరాలు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. జనసైనికులు చేసే సోషల్ మీడియా వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ బర్త్ డే వస్తే… ట్వీట్లు హోరెత్తించి ట్రెండింగ్ లోకి తెస్తారు. సినిమా అయినా అంతే. అంత పవర్ ఫుల్. అయితే ఇవన్నీ రాజకీయాల్లో ఓట్లు రాల్చడానికి పనికి రావని అందరికీ తెలుసు. కానీ జనసైనికులకు మాత్రం అర్థం కావడంలేదు. చూసి చూసి జనసేన పార్టీ నెంబర్ టు నాదెండ్ల మనోహర్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యారు. పార్టీ కార్యకర్తల మొహం మీదే చెప్పాలనుకున్నది చెప్పేశారు.
సోషల్ మీడియా పోస్టుల వల్ల ఒక్క ఓటు కూడా రాదని.. ప్రజల్లోకి వెళ్లాలని వారికి పవన్ కల్యాణ్ విజన్ గురించి చెప్పాలని.. జనసేన ఆశయాల గురించి ప్రచారం చేయాలని వాళ్లను ఓట్లు వేసే విధంగా మోటివేట్ చేయాలన్నారు. అలా కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. మనోహర్ మాటలు కాస్త కటువుగా ఉన్నా.. ఇది నిజం అని.. ఫీల్డ్ లో తిరిగే జనసైనికులు అంటున్నారు. జనసేన పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇన్ స్టంట్ గుర్తింపు కోసం ఆరాటపడేవారు ఎక్కువ అయిపోయారని.. నిజంగా జనసేన కోసం పని చేసే వాళ్లు తక్కువైపోయారన్న ఆవేదన వారిలో ఉంది.
జనసైనికులపై ఇప్పటికే ఓ రకమైన అభిప్రాయాన్ని వైసీపీ పెంచింది. పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తాం బ్యాచ్ అని ఇతర పార్టీల నేతలూ వీరిని తేలికగా తీసుకుంటున్నారు. ఇలాంటి వారంతా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటారు. సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఇతర పార్టీలను తిట్టే వారు ఎవరూ.. జనసేన పార్టీకి ఓటు వేయరని.. బ యట ప్రచారం చేయరని ఎక్కువ మంది నమ్ముతారు. దీనిపై నాదెండ్ల మనోహర్ తమ పార్టీ క్యాడర్‌కు చెప్పాల్సింది చెప్పారు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ రాజకీయం ఎంతో ముఖ్యమని తేల్చేశారు. మరి జన సైనికులు అర్థం చేసుకుంటారా ?