ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వస్తుందా? రాదా? .. అందరి ప్రశ్నా ఇదే. ఆస్కార్ రావాలనే భారతీయులంతా కోరుకొంటున్నారు. నాటు నాటు పాటకి ఆస్కార్ ఖాయమని కొంతమంది జోస్యం చెబుతున్నారు. ప్రపంచ మంతా ఊపేసిన పాట ఇది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చేసింది. దాంతో.. ఆస్కార్ రావడం లాంఛనమే అన్నది అందిరి మాటా. అయితే ఆస్కార్ వస్తుందా? రాదా? అనేది తేలాలంటే ఇంకొన్ని గంటలు ఓపిక పట్టాలి.
ఆర్.ఆర్.ఆర్కి ఆస్కార్ వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే… పోటీ మాత్రం అదే స్థాయిలో ఉంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటతో పాటు మరో నాలుగు పాటలు బరిలో ఉన్నాయి. వీటిలో నాటు నాటుకు గట్టి పోటీ.. `బ్లాక్ పాంథర్` సినిమా నుంచి ఎదురు కానుంది. ఈ సినిమాలోని `లిఫ్ట్ మి అప్` అనే గీతం ఆస్కార్ బరిలో నిలిచింది. బార్బాడియన్ గాయని రిహాన్నా ఆలపించిన పాట ఇది. ఆమె పాపులర్ గాయని. తన కెరీర్లోనే అత్యుత్తమ గీతంగా ఈ పాటని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అమెరికన్ నటుడు చాడ్విక్ బోస్మెన్కి నివాళిగా ఈ పాటని చిత్ర బృందం ప్రకటించింది. అప్పటి నుంచీ.. ఈ పాటంటే అమెరికన్లకు సెంటిమెంట్ గా మారిపోయింది. రిహాన్నాకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై ఆమె పాటలు పాడారు. దాంతో.. `లిఫ్ట్ మి అప్` అనే గీతం మరింత పాపులర్ అయ్యింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన గాయని కూడా ఆమే. ఆస్కార్ నామినేషన్ తరవాత.. ఈ పాటని మరింతగా జనంలోకి తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ అయ్యింది. ఆస్కార్ వస్తే… `బ్లాక్ పాంథర్`కి గానీ…. `ఆర్.ఆర్.ఆర్`కి గానీ రావొచ్చన్నది విశ్లేషకుల మాట. `బెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్` సినిమాలోని `అప్లాజ్` గీతానికి కూడా కొన్ని ఛాన్సులు ఉన్నాయి. మహిళా సాధికారికత గురించి చర్చించిన పాట ఇది. ఈ పాటని సోఫియా కార్సన్ పాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ మూడు పాటలకూ అవకాశం ఉంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.