వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతూండటంతో డైవర్షన్ కోసం ఏపీ అధికార పార్టీ విచిత్రమైన ప్రయత్నాలు చేస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుంది. గతంలో మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీసుల్లో పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. కనిపించిన ప్రతి చిన్న కాగితానీ వెదికారు. అదే సమయంలో… హైదరాబాద్లోని హెడ్ ఆఫీసులోనూ సోదాలు చేశారు. మీడియాలో చేసిన తప్పుడు ప్రచారం తప్ప.. ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో చర్యలు తీసుకోలకేపోయారు.
ఇప్పుడు కొత్తగా మార్గదర్శి ఉద్యోగుల పై పడ్డారు. మార్గదర్శికి చెందిన అన్ని బ్రాంచ్ మేనేజర్లలో ఇళ్లలో సోదాలు చేయడానికి సీఐడీ పెద్ద ఎత్తున సిబ్బంది ని పంపింది. ఈ విషయాన్ని మీడియాకు చెప్పి హడావుడి చేసింది. ఎప్పట్లాగే ఆవుకథలు చెప్పింది. మార్గదర్శి చిట్ అక్రమాలకు పాల్పడిందని.. నిధులు దారి మళ్లించిందని పాత కథలనే మీడియాలో పునరావృతం చేశారు.
మరో వైపు స్కిల్ డెలవప్మెంట్ స్కాం పేరుతో ప్రచారాలకూ కొదవలేదు. ఐఆర్ఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ను రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఏమీ దొరకకపోవడంతో వదిలేశారు. అంతకు ముందు అరెస్ట్ చేస్తారని ప్రచారం చేశారు. సీమెన్స్ మాజీ ఉద్యోగికి రిమాండ్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. అయినా ఈ కేసు విషయంలో ఏదో దొరికినట్లుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొత్తంగా ప్రో సాక్షి మీడియా కూడా.. అవినాష్ రెడ్డి కేసు ను డైవర్షన్ చేయడానికి చాలా కష్టపడుతోంది.