మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ రామోజీరావు, శైలజా కిరణ్‌లపై ఏపీసీఐడీ కేసులు నమోదు చేసింది. గతంలో ఆఫీసుల్లో సోదాలు చేసి ఏమీ తేల్చలేకపోయినా ఈ రోజు మాత్రం మేనేజర్లు ఇతర ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు చేసి.. ఏదో కనిపెట్టామని చెప్పి నేరుగా కంపెనీ చైర్మన్ అయిన రామోజీరావు, ఎండీ అయిన శైలజా కిరణ్‌లపై కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టారో లెక్క చెప్పలేదు. కానీ పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని.. అన్నింటిలోనూ రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆయా బ్రాంచ్ మేనేజర్లను కూడా నిందితులుగా చేర్చారు.
ఈ ఎఫ్ఐఆర్లు అన్నీ పదో తేదీన నమోదయ్యాయని సీఐడీ ప్రెస్ నోట్ విడుదల చేసిది. చిట్ ఫండ్ చట్టంలోని నిబంధనలు పాటించడం లేదని.. నగదు వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయని ఈ కేసులు పెట్టారు. నిజానికి ఒక్కరంటే ఒక్క ఖాతాదారుడు కూడా ఇప్పటి వరకూ మార్గదర్శిపై ఫిర్యాదు చేయలేదు. కానీ సొంతంగా సోదాలు నిర్వహించి.. ఈ కేసులు పెట్టారు. గతంలో కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు అధికారులు మీడియా కు లీక్ చేసిన ఆరోపణలపై ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది.
ఇప్పుడు దాదాపుగా అవే ఆరోపణలతో కేసులు పెట్టారు. నిజానికి తమ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికి .. ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సాక్ష్యాలు చూసుకోలేదు. కావాల్సిన వారిని అరెస్ట్ చేసి.. తర్వాత బెయిల్ తెచ్చుకుంటే .. అరెస్ట్ చేశాం కదా అనే సంతృప్తి పొందింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి .. వివేకా హత్య కేసులో దొరికిపోతున్న సమయంలో… ప్రత్యర్థులపై ఏదో ఒకటి చేయాలన్న కసితో.. ఇలా చేస్తున్నట్లుగా ఉందని టీడీపీ నేతలంటున్నారు. న్యాయస్థానాల్లో వారికి చీవాట్లు తప్పవని అంటున్నారు.