క్లాస్ టచ్‌తో సినిమాలు తీస్తుంటాడు అవసరాల శ్రీనివాస్. తనలో మంచి ఫన్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. చక్కని పాటల్ని ఎంచుకొని, సహజంగా సన్నివేశాల్ని తెరకెక్కించడం అవసరాల స్టైల్. తన తాజా చిత్రం `ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి`లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మాళవిక నాయర్ కథానాయిక. ఈనెల 17న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
2 నిమిషాల 10 సెకన్ల ట్రైలర్ ఇది. శౌర్య, మాళవిక పాత్రలపైనే ఫోకస్ చేశారు. వాళ్ల మాటలు, వాళ్ల మధ్య భావోద్వేగాలే తెరపై కనిపిస్తాయి. అవసరాల కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. తన పాత్ర డిటైల్స్ ఏమీ లేవు కానీ, ఈ కథని తన పాత్ర మాత్రం మలుపు తిప్పుతుందనిపిస్తుంది. మూడు దశల్లో సాగే ప్రేమకథ ఇది. తొలి దశలో పరిణితి లేకుండా, మధ్య దశలో ఈగోలతో సాగిపోయి… మూడో దశలో మళ్లీ పరిణితి వచ్చి.. ఇలా రకరకాల కోణాల్లో సాగబోతోందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. శౌర్య, మాళవికలనే ఈ సినిమాకి హైలెట్. వాళ్ల మధ్య ఎమోషన్స్ ఎంత పండితే… ఈ సినిమా అంత ఆడుతుంది. అవసరాల కామెడీ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. ఆ టింజ్ ట్రైలర్లో కనిపించలేదు. బహుశా.. సినిమాలోనే చూడాలేమో. కల్యాణీ మాలిక్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్లో ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా కూల్‌గా ఉంది. మొత్తానికి ఓ మంచి ఫీల్ గుడ్, ఎమోషనల్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న విషయం ట్రైలర్‌తో తెలుస్తోంది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.