ఇప్పుడు ఉన్నపార్టీల్లో అవకాశం చిక్కక .. దొరకదని తెలిసిన వెటరన్ లీడర్స్ జనసేన వైపు చూస్తున్నారు. వైసీపీలో ఉన్న కాండ్రు కమల, టీవీ రామారావులు జనసేనలో చేరుతున్నారు అలాగే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే్ , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరుతున్నారు. కాండ్రు కమల వైసీపీలో ఉన్నారు. గతంలో టీడీపీలో చేరారు. చేరగానే నెత్తిన పెట్టుకుంటారని ఆశించారు. అలాంటిదేమీ లేకపోవడంతో వైసీపీలో చేరారు. అక్కడా అదే పరిస్థితి. దీంతో జనసేన వైపు చూశారు. ముందస్తుగా పెద్దగా చర్చల్లేకుండా జనసేన నిర్వహించిన బీసీ మీటింగ్ కు హాజరయ్యారు.
టీడీపీలో ఓసారి ఎమ్మెల్యేగా చేసి .. తర్వాత టిక్కెట్ దక్కించుకోలేకపోయిన టీవీ రామారావు వైసీపీలో చేరారు. అక్కడ ఆయనను పట్టించుకోలేదు . దీంతో ఆయన జనసేనలో చేరాలని డిసైడయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. ఈదర హరిబాబు కూడా ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో ఎమ్మెల్యేగా చేశారు. మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో ఆయన కూడా జనసేనపై ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరేవారు ఎక్కువయ్యారు. ఇప్పుడు చేరుతున్న లీడర్లు కూడా అక్కడి వారే. కాకపోతే వీరంతా జనంలో పలుకుబడి కోల్పోయిన వాళ్లే.
వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న సూచనలు పెరుగుతూండటం… సర్వేల్లో ఫలితాలు తేడా వస్తూండటంతో చాలా మంది వైసీపీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ లో అభ్యర్థుల పోటీ ఎక్కువ గా ఉంటుంది కాబట్టి.. జనసేనలో అయితే టిక్కెట్ దక్కించుకోవచ్చని పోటీ పడుతున్నారు. ఈ కారణంగా చేరికలు మరింతగా జోరందుకునే అవకాశం ఉంది.