తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆయన ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. మొదట కేసీఆర్ సతీమణికి అస్వస్థతగా ఉండటంతో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారన్న ప్రచారం జరిగింది. తర్వాత కేసీఆర్ కే ఆస్వస్థతగా ఉండటంతో ఏఐజీలో వైద్య పరీక్షలకు వెళ్లారని అధికారవర్గాలు తెలిపారు. కేసీఆర్ వెంట… కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.
కేసీఆర్కు ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వచ్చినా యశోద ఆస్పత్రికి వెళ్తారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఈ సారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఏఐజీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీలో స్పెషలిస్ట్. అలాంటి సమస్యలు వచ్చిన వారందరూ అక్కడికే వెళ్తూంటారు. కేసీఆర్ కూడా గ్యాస్ట్రో ప్రాబ్లం వచ్చి ఉంటుందని అందుకే అక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
కేసీఆర్ ఇటీవల తీరిక లేకుండా అటు రాజకీయ.. ఇటు పాలనా వ్యవహరాల్లో తలమునకలయ్యారు. మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణపైనా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి తీరిక లేని రాజకీయ కార్యక్రమాల వల్ల ఆయనకొంత ఇబ్బంది పడ్డారు కానీ.. ఆరోగ్యానికి వచ్చిన సమస్యలేం లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి.