తెలంగాణలో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష , మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ అయినట్లుగా గుర్తించడంతో వాయిదా వేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అసలు విషయం వెలుగులోకి తెచ్చారు. మొదట కంప్యూటర్ హ్యాక్ అయిందని ప్రచారం చేశారు కానీ ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని.. దీని వెనుక హానీ ట్రాప్ ఉందని పోలీసులు తేల్చారు
పోలీసుల విచారణలో ఒక్క కంప్యూటర్ కూడా హ్యాక్ కాలేదని, వలపు ఎరలో చిక్కిన ఈ సంస్థ ఉద్యోగి ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు తేలింది ..కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ పై ఓ యువతి వలపు వల విసిరిందని, ఈ ట్రాప్ లో చిక్కుకున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు తేల్చారు. పేపర్ లీకేజీ ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు టీఎస్ పీఎస్ సీ ఆఫీసుకు వచ్చిపోయే వారి వివరాలను పరిశీలించారు. రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలలో వెతికారు. దీంతో కొంతకాలంగా ఓ యువతి తరచుగా ఆఫీసుకు వస్తోందని గుర్తించారు.
ఆమె తరచూ ప్రవీణ్ ను కలుస్తోందని తేలింది. టీఎస్ పీఎస్ సీ సెక్రెటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ తో సన్నిహితంగా మెలుగుతూ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని అడిగింది. ఆమె కోసం ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వలపు ఎర యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఇలా కూడా పేపర్ లీక్ చేస్తారా అని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారి ఆశ్చర్యపోతున్నారు.