బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి తెదేపా ప్రభుత్వాన్ని పోలవరం, రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కచెప్పడంలేదని విమర్శించారు. అందుకు తెదేపా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా చాలా గొప్పగా జవాబు చెప్పారు.
పురందేశ్వరి బీజేపీలో కాంగ్రెస్ కోవర్ట్ గా పనిచేస్తోందని, ఏదో విధంగా తెదేపా, బీజేపీల స్నేహన్ని చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీలో ఉంటూ తెదేపాను విమర్శించడమే పనిగా పెట్టుకొన్నారని, అది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగమే కావచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఆమె ఎంత ప్రయత్నించినా తెదేపా-బీజేపీల స్నేహం చెడగొట్టలేరని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆమె యూపిఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు కనీసం ఇప్పుడయినా రాష్ట్రానికి మేలు కలిగించే పనులేవీ చేయకుండా తెదేపా-బీజేపీల బంధాన్ని త్రెంచాలని విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.
బుచ్చయ్య చౌదరి చేసిన ఆరోపణలలో పురందేశ్వరి తెదేపాను విమర్శించడమే పనిగా పెట్టుకొన్నారనే విషయం మాత్రం నూటికి నూరు పాళ్ళు వాస్తవమే. అయితే అది ఆమెకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మధ్య గల వ్యక్తిగత, రాజకీయ వైరం కారణంగానే తప్ప బుచ్చయ్య చౌదరి ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా మాత్రం కాదని చెప్పవచ్చును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎప్పటికయినా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అటువంటి ఆలోచన చేస్తున్నారన్నా అర్ధం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సమర్దుడయిన నాయకత్వం లేని కారణంగా వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉండక పోవచ్చును. ఒకవేళ అదే జరిగితే ఇంకా కాంగ్రెస్ మరో పది పదిహేనేళ్ళపాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. కనుక భవిష్యత్ అంధకారంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పురందేశ్వరి ఏజెంటుగా పనిచేస్తున్నారని బుచ్చయ్య చౌదరి చెప్పడం సహేతుకంగా లేదు. కేంద్రం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పడం లేదు? అనే ఆమె ప్రశ్నకు బుచ్చయ్య చౌదరి సమాధానం చెప్పనే లేదు.