ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా, అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రభుత్వం వైపు నుంచి ఓ లీక్ వస్తుంది. అదేమిటంటే మూడు రాజధానులపై నిర్ణయం అని.. బిల్లు పెట్టేస్తున్నారని. సాధ్యా సాధ్యాల గురించి ఎవరూ ఆలోచించరు. గవర్నర్ ప్రసంగం విషయంలోనూ అంతే. ఏడాదికి ఒక్క సారి జరిగే ఉభయ సభల సమావేశంలో గవర్నర్ ప్రసగంలో మూడు రాజధానుల అంశం పెట్టడం కామన్. గత గవర్నర్ అసలు మూడు రాజధానుల అంశంపై రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న బిల్లుపైనే సంతకం పెట్టారు. అలాంటిది స్పీచ్‌లో ఉంటే పట్టించుకుంటారని లేదు.కానీ ఇప్పుడు గవర్నర్ మారారు. ఆయన మాజీ జస్టిస్.
మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. దానిపై మళ్లీ బిల్లులు పెట్టడం కానీ చట్టసభల్లో మాట్లాడటం కానీ ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడమే అవుతుంది. న్యాయవ్యవస్థ నుంచే వచ్చిన గవర్నర్ దీనికి ఆమోదిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. మాజీ జస్టిస్ నోట మూడు రాజధానుల మాట పలికించాలని ప్రభుత్వం ప్రయత్నించకుండా ఉండదు. మరి గవర్నర్ అయిన మాజీ జస్టిస్ మూడు రాజధానుల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ?
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. పదవి విరమణ చేసిన వెంటనే గవర్నర్ గా అవకాశం పొందడంపై అనేక విమర్శలు వచ్చాయి. మేధావులు అనేక విధాలుగా ప్రశ్నించారు. అంతే కాదు.. ఆయన తీర్పులనూ శంకించడం ప్రారంభించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం రాసిచ్చిందని చట్ట విరుద్ధమైన అంశాలను కూడా తన నోటి నుంచి వచ్చేలా చేస్తే… ఆయనపై మరింత విమర్శలు పెరుగుతాయి. ఆయనను డ్యామేజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఖాయమే.. ఆయనే తెలివిగా వ్యవహరింంచాల్సి ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.