తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. తమ పార్టీ వృద్ధి చెందుతుందా లేదా అన్న విషయం పక్కన పెట్టి తమ వర్గం.. తమ రాజకీయాలు అన్నట్లుగా ఉంటారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలోకి వెళ్లిపోయింది. కొద్ది రోజులుగా బీజేపీ నేతల విమర్శలు బహిరంగమైపోయాయి. మీడియా ఎదుట వాదించుకోవడం ప్రారంభించారు. బండి సంజయ్ పై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలతో కొత్త దుమారం ప్రారంభమయింది.
కవిత విషయంలో బండి సంజయ్ ఓ కామెంట్ చేశారు. లిక్కర్ స్కాం చేసిన కవితను దర్యాప్తు సంస్థలు జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటాయా అని కామెంట్ చేశారు. ఇది అందరూ చేసే ఓ పద ప్రయోగం. మొదట బీఆర్ఎస్ కూడా అలాగే తీసుకుంది.కానీ మూడు రోజుల తర్వాత .. వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఆందోళనలు ప్రారంభించింది. బండి సంజయ్ పై కోపం ఉన్న బీజేపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. అర్వింద్ బయటపడిపోయారు. బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలన్నారు
ఈ వివాదం కేంద్రంగా ఎంత రచ్చ చేయాలో బీజేపీ నేతలు చేసుకుంటున్నారు. రాజాగాసింగ్ తక్షణం అర్వింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. విజయశాంతి కూడా స్పందించారు. బండి సంజయ్ కు మద్దతుగా మాట్లాడారు. అందరూ ఏదో విధంగా స్పందించాల్సిన పరిస్థితి. దీంతో బీజేపీలో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే ఈటలతో ఇతర నేతలకు సరిపపడటంలేదు. ఇప్పుడు అది బహిర్గతమవుతోంది. ఈ పరిస్థితిని బీజేపీ హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదు.కలసి పని చేయాలనే మాటలు చెప్పి సరిపెడుతోంది.