ఏ అసెంబ్లీలో అయినా ప్రతిపక్షాలను ధిక్కరించి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ అధికార పార్టీని ధిక్కరించి… ప్రతిపక్షంలో చేరిన వారు ఉండటం అరుదు. అలాంటివారు అసెంబ్లీ సమావేశాలు జరిగితే… అసెంబ్లీకి రావడం ఇంకా అరుదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అది కనిపించనుంది. అసెబ్లీకి హాజరవ్వాలని వైసీపీని ధిక్కరించిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి నోరు తెరుస్తారో లేదో కానీ కోటంరెడ్డి మాత్రం దూకుడుగా ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఆ మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో టాక్ ఆఫ్ ఏపీగా మారిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వైసీపీకి ఆయన కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కోటంరెడ్డి వైసీపీలో ఉండగా అసెంబ్లీలో చంద్రబాబుని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడేవారు. తన స్థానాన్ని సైతం మార్చుకుని టీడీపీ నేతలకు చేరువగా కూర్చుని వారిని మాటలతో రెచ్చగొట్టేవారు.
ఇప్పుడు కోటంరెడ్డి సొంత పార్టీకే చుక్కలు చూపించాలని నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మరోసారి ఆయన అసెంబ్లీ వేదికగా వినిపిస్తారా లేక, స్థానిక సమస్యల పరిష్కారం కోసం పట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి బెదిరింపులను వైసీపీ తేలికగా తీసుకోదు. అవసరమైతే తోటి సభ్యులతో దాడి చేయించడానికి కూడా వైసీపీ హైకమాండ్ సిద్ధమవుతుంది. ఇదంతా కోటంరెడ్డికి తెలియనిదికాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సంచలనమే.