ఎపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును చూసి మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదనకు గురయ్యారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని .. బోగస్ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారని ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్నా ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నిస్తూ … నేరుగా సీఈవోకే లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రహసనంగా మారిందని.. కళ్లముందే అక్రమాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఈవోను ప్రశ్నించారు
బోగస్ ఓట్ల నమోదుకు తిరుగులేని సాక్ష్యాలు కనిపిస్తున్నాయన్నారు. అక్రమాలపై చట్ట పరంగా సత్వర చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ అధికారవర్గాల్లో సంచలనం రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరిగాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. బోగస్ ఓటర్లను పెద్ద ఎత్తున చేర్చాలని విపక్షాలు ఎన్నికలకు ముందు వందలకొద్దీ ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వారంతా యథేచ్చగా ఓట్లేశారు. అదే సమయంలో స్థానికేతరుడంటూ లోకేష్ బస కూడా చేయనివ్వకుండా మదనపల్లె నుంచి పంపేశారు. కానీ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పోలింగ్ బూత్‌లను పర్యవేక్షించారు. ఇలాంటి లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పని చేయాల్సిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా మిన్నకుండిపోయారు. దొంగ ఓటర్లను బూత్‌లలోకి అనుమతిస్తూ.. వారిని అడ్డుకున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి పనులనూ ఆపలేకపోయారు. మొత్తానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ వల్ల సీఈవో కీలక నిర్ణయం తీసుకుంటారో లేదో కానీ… వ్యవస్థల పతనానికి వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా గొంతెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.