నెగిటీవ్ టాక్ కూడా ఒక్కోసారి ప్లస్ పాయింట్ గా మారుతుంటుంది. ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తుంటుంది. రానా నాయుడు విషయంలో అదే జరిగింది. వెంకటేష్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే… సిరీస్ చూసిన వాళ్లంతా పెదవి విరిచారు. ఇంత అడల్డ్ కంటెంట్ ఎక్కడా చూళ్లేదు మొర్రో అన్నారు. చూసినవాళ్లే కాదు. తీసినవాళ్లదీ అదే మాట. `ఫ్యామిలీస్‌తో కలిసి మాత్రం చూడకండి` అంటూ ముందే హింట్ ఇచ్చారు. రానా నాయుడుపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే.. అనూహ్యంగా ఇదే.. ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ అయిపోయింది. నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న నెంబర్ వన్ వెబ్ సిరీస్ ఇదే. సిరీస్‌కు పాజిటీవ్ టాక్ వస్తే… ఈ రేటింగ్ ఉండేది కాదేమో? బూతులున్నాయి, అడల్ట్ కంటెంట్ ఉంది.. అని చూసినవాళ్లంతా సోషల్ మీడియాకొచ్చి తమ అభిప్రాయాలు చెప్పడం వల్లో ఏమో.. సడన్ గా `రానా నాయుడు`కి రేటింగులు పెరిగిపోయాయి. యూత్ ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. వాళ్లు వేటికైతే ఆకర్షితులవుతారో.. అవన్నీ నిండిపోయిన ఉన్న వెబ్ సిరీస్ ఇది. అందుకే.. చూడొద్దంటున్నా.. వాళ్లు చూస్తూనే ఉన్నారు. అందుకే నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసింది రానా నాయుడు. `ఓ మంచి సినిమా వచ్చింది చూడండి.. బాబూ` అంటే పట్టించుకొనే నాథుడు ఉండడు. `చూడొద్దు… చూడొద్దు` అంటూ మాత్రం.. రేటింగులు పెరిగిపోతుంటాయి. ఇదేం చోద్యమో..?