పులివెందులలో పూల అంగడి సెంటర్లో వైసీపీ ఫ్లెక్సీలు ఎప్పుడూ ఉంటాయి. గతంలో వైఎస్ ఉన్నప్పుడు.. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు … ప్రతీ ఫ్లెక్సీలోనూ వారి ఫోటోలు ఖాయం. ఇప్పుడు సీన్ మారిపోయింది. బుధవారం వైఎస్ వివేకా వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వైఎస్ ఉన్నారు కానీ జగన్ కనిపించలేదు. ఇది పులివెందులలో చర్చనీయాంశం అయింది. జగన్ లేని వైఎస్ కుటుంబ ఫ్లెక్సీలను చూస్తామని అనుకోలేదని… కళ్ల ముందు కనిపిస్తోందని పులివెందుల వాసులు చర్చించుకోవడం కనిపిస్తోంది.
వైఎస్ వివేకా హత్య తర్వాత అసలు విషయం బయటపడక ముందు అబ్బాయిలు విగ్రహాలు పెట్టారు. దండలేశారు. వర్థంతులు, జయంతులు నిర్వహించారు. పులివెందుల ఎప్పుడు వెళ్లినా వైఎస్‌తో పాటు నివాళి అర్పించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు వివేకానందరెడ్డికి నివాళి అర్పించడాన్ని తప్పుగా భావిస్తున్నారు. అందుకే నాలుగో వర్థంతికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కానీ వివేకా సానుభూతిపరులు చేశారు. వారే ఫ్లెక్సీలు వేశారు. వారు జగన్ ఫోటోలను వేయలేదు. దీంతో కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ సునీత కుటుంబీకులు వివేకా తరపున రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ కుటుంబం రెండు గా చీలిపోతుంది ప్రజల సానుభూతి వైఎస్ వివేకా కుటుంబం వైపే ఉండే .. అసలు సంచలనం నమోదవుతుంది. అయితే సునీత వర్గీయులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో లేదో ఇంకా స్పష్టతలేదు. వస్తే మాత్రం వారు వైసీపీ తరపున ఉండే అవకాశం లేదు.