గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న సినిమా రామబాణం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలూ హిట్టే. కాబట్టే `రామబాణం`పై ఆశలు, అంచనాలు పెరిగాయి. పైగా మంచి టైటిల్ దొరికింది. ఫ్యామిలీకీ, మాస్కీ నచ్చే టైటిల్ ఇది. సో… రామబాణం రైట్ రూట్ లోనే వెళ్తోంది. కానీ బడ్జెట్ విషయంలో మాత్రం రాంగ్ రూట్ పట్టిందేమో అన్నది ట్రేడ్ వర్గాల మాట. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే అదుపు తప్పిపోయిందని టాక్. పైగా ఫుటేజీ కూడా ఎక్కువ వచ్చేసిందట. శ్రీవాస్ ఇప్పటికే మూడున్నర గంటల సినిమా తీశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈతరం దర్శకులు అంతే. తాము అనుకొన్నది అనుకొన్నట్టుగా వచ్చేంత వరకూ తీస్తూనే ఉంటారు. రాసుకొన్న ప్రతీ సీన్ తెరపై చూసుకోవాలని ఆశ పడతారు. అందులో భాగంగానే.. ఫుటేజీ పెరిగిపోయింది. ఇందులో కనీసం గంట సినిమాకి కత్తెర పడాలి. అంటే ఎడిటర్ కి పెద్ద పనే పడింది. సినిమా ఫలితం బాగుంటే… ఇవేం పెద్దగా సమస్యలు అనిపించవు. ఒకవేళ తేడా కొడితే… వీటినే భూతద్దాలతో చూడడం మొదలెడతారు. మరి శ్రీవాస్ ఇప్పటికైనా.. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకొంటాడో, లేదో చూడాలి.