పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్ లో కేంద్రం కేటాయించిన రూ. 100 కోట్ల నిధులను చూస్తే దానిని పూర్తి చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదనే విషయం స్పష్టం అవుతోంది. అదే మాట తెదేపా నేతలు అంటే బీజేపీ నేత పురందేశ్వరికి రోషం పొడుచుకు వచ్చేసింది. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను తెదేపా ప్రభుత్వ స్వాహా చేసేసిందన్నట్లు మాట్లాడారు. కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాత్రం ఆమెకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆందోళనను తాను అర్ధం చేసుకోగలనని, బడ్జెట్లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించినందుకు కంగారుపడవద్దని, దానిని సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చేరు. ఆ ప్రాజెక్టు పనుల పురోగతిని, దానికి కేటాయిస్తున్న నిధుల గురించి ఆర్ధిక శాఖ, నీతి ఆయోగ్ అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారని ఆమె తెలిపారు.
గత ఏడాది కూడా బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించినప్పుడు ఉమా భారతి ఇదే విధంగా భరోసా ఇస్తూ మాట్లాడారు తప్ప గత ఏడాది కాలంలో ఆ ప్రాజెక్టుకి అదనంగా ఒక్క పైసా విదిలించలేదు. కాకపోతే ఆమె పురందేశ్వరిలాగ తమ వైఫల్యాన్ని తెదేపా ప్రభుత్వంపైకి బదిలీ చేసేందుకు ప్రయత్నించకుండా యధాప్రకారం హామీలు ఇస్తున్నారు.
ఒకే ప్రాజెక్టు గురించి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు మాట్లాడి తప్పించుకోవాలని చూస్తుంటే, మరొకరు హామీలు గుప్పిస్తూ సంవత్సరాలు దొర్లించేయాలని చూస్తున్నారు. చివరికి వారిద్దరూ చెప్పేది మాత్రం ఒక్కటే…పోలవరం ఇప్పుడప్పుడే పూర్తి అయ్యే అవకాశాలు లేవని. బహుశః ఆ సంగతి చంద్రబాబు నాయుడుకి కూడా ముందే తెలుసు కనుక ఆయన పట్టిసీమను భుజానికెత్తుకొన్నారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా అర్ధమయింది కనుకనే ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారనుకోవాలి. ఆ సంగతి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుసు కనుకనే ఆంధ్రాకు ఇచ్చేసిన పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చేస్తారని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారనుకోవలసి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదనే సంగతి రెండు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి, కేంద్ర ప్రభుత్వానికి అందరికీ తెలుసు కానీ వెర్రి ఆంధ్రా ప్రజలకే ఇంకా తెలియదు పాపం. అందుకే ఈ రాజకీయ నేతలు అందరూ చెపుతున్న మాటలను చెవులు రికించుకొని మరీ వింటూ పోలవరం కోసం ఆశగా ఎదురు చూస్తూ 22 నెలలు లెక్కపెట్టేశారు. ఇంకా మరో 38 నెలలు లెక్క పెట్టేస్తే సరిపోతుంది.