తెలంగాణలో ఈ సారి బీఆర్ఎస్ పార్టీ తమతో పొత్తు కోసం ఆసక్తి చూపడంతో లెఫ్ట్ పార్టీలకు ఎక్కడా లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆ జాబితాను బీఆర్ఎస్ హైకమాండ్‌కు పంపారు. పదిహేను నియోజకవర్గాలను వారు ఎంపిక చేసుకున్నారు. వారి ఉద్దేశం ఆ పదిహేను నియోజకవర్గాలు ఇవ్వమనే. రెండు కమ్యూనిస్టు పార్టీలు ఈ సారి అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
అయితే కేసీఆర్ కు పదిహేను సీట్లు కాదు కదా.. కనీసం నాలుగు సీట్లు కూడా ఆ పార్టీలకు కేటాయించే పరిస్థితి లేదు . సొంత పార్టీ నుంచే ప్రతి నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. వారిని కాదని కమ్యూనిస్టులకు టిక్కెట్లు ఇవ్వలేరు. అయినా జాతీయ రాజకీయాల కోసం అయినా.. జాతీయ స్థాయిలో మద్దతు కోసం అయినా ఇక్కడ ఎమ్మెల్యే, ఎంంపీ టిక్కెట్లు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
ఢిల్లీలో కవిత చేపట్టిన మహిళా రిజర్వేషన్ల దీక్షకు కమ్యూనిస్టులే కీలక మద్దతుదారులుగా నిలిచారు. రాజకీయంగా పరస్పర సహకారం ఉండకపోతే వారు ఇక ముందు కేసీఆర్ వైపు చూడరు. ఇదే కారణంతో ఇక్కడ లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్ కు తమ అవసరం ఉన్నప్పుడే మరింతగా… ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని… సీట్ల లెక్కలతో రంగంలోకి దిగిపోయారు. మరి కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ?