కొత్త దర్శకులతో పని చేయడం అంటే నానికి చాలా సరదా, ఇష్టం. ఇండస్ట్రీకి చాలామంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశాడు నాని. వాళ్లలో చాలామంది హిట్లు కొట్టి, విజయవంతమైన దర్శకులుగా మారారు. ఇప్పుడు దసరాతో శ్రీకాంత్ ఓదెలని డెరైక్టర్ చేసేశాడు. తనకీ ఇది తొలి సినిమానే. అయితే ఈ సినిమా ఇవ్వడానికి దర్శకుడికి ఓ పరీక్ష పెట్టాడు నాని. ఇది ఓ రకంగా `దసరా` ఫ్లాష్ బ్యాక్ అనుకోవాలి.
ఓసారి.. శ్రీకాంత్ ఓదెల నాని అప్పాయింట్ మెంట్ తీసుకొన్నాడు. గంటలో కథ చెప్పాలన్నది ఒప్పందం. శ్రీకాంత్ చాలా ఇంట్రావర్ట్. అసలు తను కథ చెప్పగలడా? అనే అనుమానం నానికి వచ్చిందట. కానీ… గంటలో అయిపోతుందనుకొన్న కథని ఏకంగా 4 గంటలు నేరేట్ చేశాడు శ్రీకాంత్. నాని తన కెరీర్‌లో అప్పటి వరకూ విన్న నేరేషన్లకు.. శ్రీకాంత్ చెప్పిన నేరేషన్లకు అస్సలు సంబంధం లేదట. కథ బాగా నచ్చినా.. చెప్పినట్టు తీయగలడా? లేదా? అనే అనుమానం వచ్చింది నానికి. వెంటనే… అసలు షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా సరిపడనంత ఎమౌంట్ ఇచ్చి, ఈ సినిమాలో రెండు సీన్లు తీసి, నాకు చూపించు.. అప్పుడు ఆలోచిస్తా.. అంటూ ఆఫర్ ఇచ్చాడట. నాలుగు రోజుల్లోనే, తనకు నచ్చిన నటీనటుల్ని ఎంపిక చేసుకొని, ఆ రెండు సీన్లూ తీసి నాని దగ్గరకు వచ్చాడట. ఎయిర్ పోర్ట్‌కు బయలు దేరిన నాని.. దారి మధ్యలో శ్రీకాంత్ ని పికప్ చేసుకొని, కారులో, లాప్‌టాప్‌లోనే ఆ రెండు సీన్లూ చూసేశాడట. వెంటనే.. ఫ్లాట్ అయిపోయి.. ఎయిర్ పోర్టుకి వెళ్లేలోగా `ఈ సినిమా మనం చేస్తున్నాం` అని మాట ఇచ్చేశాడట. ఆ రెండు సీన్లూ నానికి అంత బాగా నచ్చాయట. అలా… శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చేశాడు నాని. ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. మరి.. నానిని మెప్పించినట్టే బాక్సాఫీసునీ శ్రీకాంత్ మెప్పించగలిగితే, తొలి అడుగులోనే శ్రీకాంత్ ఓదెల ఓ హిట్ వేసుకొంటాడు.